భీకరమైన ప్రకృతి వైపరీత్యాల మధ్య తుప్పు పట్టని రైలు పట్టాలు.. కారణం తెలిస్తే మీకున్న పెద్ద డౌట్ తీరిపోతుంది!
ABN , First Publish Date - 2021-10-28T15:24:33+05:30 IST
సాధారణంగా ఇంట్లో ఉండే ఇనుప వస్తువులకు..

సాధారణంగా ఇంట్లో ఉండే ఇనుప వస్తువులకు తుప్పు పట్టడాన్ని మనం చూస్తుంటాం. అయితే ఇనుముతో తయారుచేసిన రైల్వే ట్రాక్‌లు.. భారీ వర్షాలు, ఎండ వేడిమితోపాటు అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నప్పటికీ వాటికి తప్పు పట్టదు. దీనికి కారణమేమిటని ఎప్పుడైనా ఆలోచించారా? రైల్వే ట్రాక్‌లకు ఎందుకు తుప్పు పట్టదనే ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే ముందుగా ఇనుముకు ఎందుకు తుప్పుపడుతుందో అర్థం చేసుకోవాలి. ఇనుము ఒక బలమైన లోహం. అయితే దానికి తుప్పు పట్టినప్పుడు దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఇనుముతో తయారైన వస్తువు.. ఆక్సిజన్ తో పాటు తేమతో చర్య జరిపినపుడు కొన్ని అవాంఛిత సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. దీంతో అది క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో దాని రంగు కూడా మారుతుంది. దీనినే ఇనుము తుప్పు పట్టడం అని అంటారు.
రైల్వే ట్రాక్‌కు.. దానిపై నడిచే చక్రాలకు మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ట్రాక్ తుప్పు పట్టదని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. రైల్వే ట్రాక్‌ల తయారీ కోసం ప్రత్యేక రకమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఉక్కు, మాంగనీస్‌ల సమ్మేళనంతో రైల్వే ట్రాక్‌లను తయారు చేస్తారు. ఉక్కు, మాంగనీస్‌ల మిశ్రమాన్ని మాంగనీస్ స్టీల్ అంటారు. ఈ సమ్మేళనంతో ఆక్సీకరణ జరగదు. ఫలితంగా చాలా కాలం పాటు రైల్వే ట్రాక్‌లకు తుప్పు పట్టదు. ఒకవేళ రైల్వే ట్రాక్‌లను సాధారణ ఇనుముతో చేసినట్లయితే, గాలిలోని తేమ కారణంగా తుప్పు పట్టేందుకు అవకాశాలుంటాయి. ఫలితంగా తరచూ ట్రాక్‌లను మార్చాల్సి రావచ్చు. అలాగే రైలు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రైల్వే ట్రాక్‌ల నిర్మాణంలో ప్రత్యేక ధాతువులను ఉపయోగిస్తారు.