టిక్కెట్ల రేట్లను పక్కనపెడితే.. ఏటా ఎన్ని సినిమాలొస్తాయి? 10 లక్షల మందికి ఎన్ని థియేటర్లు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-12-30T14:46:27+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల వ్యవహారం..

టిక్కెట్ల రేట్లను పక్కనపెడితే.. ఏటా ఎన్ని సినిమాలొస్తాయి? 10 లక్షల మందికి ఎన్ని థియేటర్లు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్లు పెరుగుతుండగా, ఏపీలో వీటి ధరలు కనిష్ట స్థాయికి చేరాయి. ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని అలా ఉంచితే, దేశంలో ప్రస్తుతం సినిమా థియేటర్ల పరిస్థితి ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో ప్రతి సంవత్సరం పలు భాషలలో సుమారు రెండు వేల చలనచిత్రాలు నిర్మితమవుతున్నాయి. ఈ సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చాలా అధికం. బెంగాలీ, భోజ్‌పురి, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, పంజాబీ తదితర భాషా చిత్రాలు లెక్కకుమించి విడుదలవుతుంటాయి. ఈ విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తుంది. హిందీ సినిమాలు దేశప్రజలందరినీ అలరిస్తాయి. సినిమాలను ఇంతలా ఇష్టపడే మన దేశంలో.. ఇక్కడి జనాభాకు సరిపడా సినిమా థియేటర్లు లేకపోవడం విశేషం.


1,500 సినిమా థియేటర్ల మూసివేత

సినిమా హాళ్లకు కేంద్రంగా దేశంలోని ముంబై నిలిచింది. దేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ అయిన PVR  అధికస్థాయిలో స్క్రీన్‌లను కలిగి ఉంది. దేశంలో 20 ఏళ్ల క్రితం 11 వేల 692 సినిమా హాళ్లు, 1400 మొబైల్ టాకీస్‌లు ఉండేవి. వీటి సంఖ్య ప్రస్తుతం 8 వేలకు దిగజారింది. మహమ్మారి కారణంగా 1,500 థియేటర్లు మూతపడ్డాయి. 


ప్రస్తుతం మనదేశంలో ప్రతి పది లక్షలమందికి కేవలం ఎనిమిది సినిమా థియేటర్లు మాత్రమే ఉన్నాయి. దీనిని ఇతర దేశాలతో పోల్చిచూస్తే చైనాలో ప్రతీ పది లక్షల మంది ప్రేక్షకులు 37 థియేటర్లు, అమెరికాలో 124 సినిమా హాళ్లు ఉన్నాయి. మన దేశంలో థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడివారు 2017లో 198 కోట్ల సినిమా టిక్కెట్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో చైనాలో 162 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అమెరికాలో అయితే కేవలం 124 కోట్ల సినిమా టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. భారతదేశంలో సినిమా హాళ్ల సంఖ్య తగ్గడానికి పలు కారణాలున్నాయి. ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు, థియేటర్ల మెయింటనెన్స్, వినోదపు పన్ను, టెలివిజన్, హోమ్ వీడియో, స్ట్రీమింగ్, టిక్కెట్ల రేట్లు అధికం కావడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్  మొదలైనవన్నీ థియేటర్లకు ఆదరణ తగ్గడానికి కారణాలుగా నిలిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మొబైల్‌ ఫోనులో సినిమాలు చూసేందుకు అలవాటు పడ్డారని మహారాష్ట్రలోని సుమేధ్ టూరింగ్ టాకీస్ నడుపుతున్న మహమ్మద్ నౌరంగి తెలిపారు. సుశీల్ చౌదరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పిక్చర్ టైమ్ అనే టూరింగ్ టాకీస్ చైన్ యజమాని. లాటిన్ అమెరికాలో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఇప్పుడు టూరింగ్ టాకీస్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 2015లో సొంత కంపెనీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 37 మూవింగ్ టాకీస్ ప్రారంభించారు. మూడు వేల స్క్రీన్లు నడపాలన్నది సుశీల్ లక్ష్యం. వారు తమ టాకీస్‌లను తూర్పు హిమాలయాలలోని తవాంగ్ నుంచి మధ్య భారతదేశంలోని నక్సలైట్ ప్రాంతాల వరకూ తీసుకెళ్లారు.

Updated Date - 2021-12-30T14:46:27+05:30 IST