14 ఏళ్ల స్కెచ్.. కుటుంబంలో అందరినీ ఖతం చేసింది.. మరిదికి వచ్చిన డౌట్‌తో సీన్ రివర్స్.. రెండో భర్తకు కొత్త టెన్షన్!
ABN , First Publish Date - 2021-09-02T00:00:24+05:30 IST
భార్య చేతిలో మొదటి భర్త హత్య.. రెండో భర్తకు కొత్త టెన్షన్!
ఇంటర్నెట్ డెస్క్: ‘‘నా భార్యది భయంకరమైన మనస్తత్వం.. ఆమెతో కలిసుంటే నాకు ప్రాణాపాయం తప్పదు.. దయచేసి నాకు డైవర్స్ ఇప్పించండి.. ’’ అంటూ ఓ భర్త ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన పేరు షాజూ జకారియా..! ఆయన భార్య పేరు జాలీ అమ్మా జోసెఫ్(49). జాలీ సాగించిన ఈ మృత్యు కేళి.. 2019లో వెలుగులోకి వచ్చి కేరళలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ‘కేరళ సైనైడ్ మర్డర్లు’ పేరుతో ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
తన అత్తారింటి పాలిట మృత్యు దేవతగా మారిన జాలీ తన భర్తతో సహా మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను పొట్టనపెట్టుకుందనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. తాను చేసిన నేరాల్ని జాలీ అంగీకరించిందని కేరళ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జాలీ కటకటాల పాలయ్యింది. తాజాగా.. ఆమె రెండో భర్తకు కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో..ఆయన జాలీ నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
భార్యతో ఇక ఎంతమాత్రం కలిసుండే పరిస్థితి లేదని షాజూ జకారియా చెప్పినట్టు ఆయన తరుఫు లాయర్ మీడియాకు చెప్పారు. ‘‘షాజూ ఆమెను పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె ఈ హత్యలకు కారణమని ఆయనకు తెలియదు. వరుస మరణాలపై దర్యాప్తు మొదలైయ్యాకే తన భార్య వికృత మనస్తత్వం గురించి షాజూకు తెలిసింది. జాలీ బెయిలుపై బయటకు వచ్చి.. లేదా.. కేసు తరువాత విడుదలై వచ్చాక ఆమెతో షాజూ కలిసుండాల్సి వస్తే తనకు ప్రమాదమని షాజూ భావిస్తున్నారు’’ అని షాజూ తరపు లాయర్ తెలిపారు.
14 ఏళ్లలో.. 6 హత్యలు.. దేశవ్యాప్తంగా కలకలం..!
జాలీ ఆడిన వికృత క్రీడలో మొదటగా బలైన వ్యక్తి ఆమె అత్తగారే! 2002లో అన్నమ్మా థామస్ అకస్మాత్తుగా మరణించారు. 2008లో జాలీ మామగారైన టామ్ థామస్ మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనూ జాలీ ఘటనా స్థలంలోనే ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తరువాత.. 2011లో జాలీ భర్త రాయ్ థామన్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పటికే ఆయనకు ఆర్థికపరమైన సమస్యలు ఉండటం.. ఆయన శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నట్టు పోస్ట్‌మార్టంలో వెల్లడవటంతో రాయ్ థామస్ ఆత్మహత్య చేసుకున్నట్టు అంతా భావించారు. కానీ.. రాయ్ థామస్ మేనమామ మ్యాథ్యూ .. ఇవన్నీ అసహజ మరణాలంటూ కొత్త అనుమానాలు లేవనెత్తారు. పోలీసు దర్యాప్తు జరగాలని కోరుకున్నారు. కానీ..2014లో ఆయన కూడా మరణించారు. ఇక.. 2017లో జాలీ.. రాయ్ థామస్‌కు బంధువైన షాజూ జకారియాను పెళ్లి చేసుకుంది. అంతకుమునుపే..అంటే 2014లో షాజూ కూతురు ఆల్పైన్(2) మరణించింది. 2016లో షాజూ భార్య సిలీ కూడా మృత్యువు ఒడికి చేరుకుంది.
వీరందరినీ జాలీ థామస్ సైనైడ్ విషం ఇచ్చి పొట్టనపెట్టుకుననట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎలుకలను చంపడం కోసం జాలీ తమ నుంచి సైనైడ్‌ను తీసుకున్నట్టు జువెలరీ షాపులో పనిచేసే ఎమ్ఎస్ మ్యాథ్యూ, స్వర్ణకారుడైన ప్రజీ కుమార్ పోలీసులకు తెలిపారు. ఇక.. ఈ హత్యలకు కారణం ఆర్థికపరమైన అంశాలేనని తెలుస్తోంది. తాను చేసిన నేరాలన్నిటినీ జాలీ అంగీకరించినట్టు కూడా పోలీసులు తెలిపారు. అయితే.. కేరళ హైకోర్టు గతంలో ఆమెకు బెయిలు మంజూరు చేసింది. దీంతో కేరళప్రభుత్వం ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కాగా.. కోర్టు విచారణకు ఆవల జాలీ తన వాంగ్మూలం ఇచ్చిందంటూ కేరళ హైకోర్టు అప్పట్లో ఆమెకు బెయిలు మంజూరు చేసింది.
ఇప్పటికీ మిస్టరీగానే..
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొన్ని అంశాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో జన్మించిన జాలీ డిగ్రీ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసింది. 1997లో ఆమెకు రాయ్ థామస్‌తో వివాహమైంది. ఈ క్రమంలో జాలీ తాను ఎమ్‌కామ్ గ్రాడ్యుయేట్ అని, ఇరుగుపొరుగు వారితో చెప్పేది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నానంటూ రోజు ఆఫీసుకు వెళ్లివచ్చేది. అయితే..అవన్నీ అబద్ధాలేనని ఆ తరువాత వెళ్లడైంది. కానీ.. ఇలా ప్రతిరోజు ఆమె ఉద్యోగం పేరిట ఎక్కడికి వెళ్లివచ్చేదనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏకంగా 14 ఏళ్ల పాటు జాలీ సాగించిన ఈ మృత్యుక్రీడకు 2019లో తెరపడింది. ఆ ఏడాది.. రాయ్ థామస్ తమ్ముడు తన కుటుంబంలో చోటుచేసుకున్న అసాధారణ మరణాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాతే.. జాలీ జైలుపాలైంది.