పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా.. ఒక్క ఘటనతో అతడి లైఫ్ టర్న్.. ఇప్పుడు స్విడ్జర్లాండ్‌లో..

ABN , First Publish Date - 2021-06-21T18:11:38+05:30 IST

పదో తరగతి ఫెయిలై.. పదహారో ఏట ఆటోవాలా అవతారం ఎత్తిన రాజ్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు. అతని కథేంటో ఒకసారి చూద్దామా?

పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా.. ఒక్క ఘటనతో అతడి లైఫ్ టర్న్.. ఇప్పుడు స్విడ్జర్లాండ్‌లో..

కొన్ని కథలు వింటే అస్సలు నమ్మలేం. ఇదేదో సినిమా కథ అంటూ కొట్టిపారేస్తాం. కానీ అలాంటి కథలు మన చుట్టూ బోలెడు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ సింగ్ రాజ్ కథ కూడా ఒకటి. పదో తరగతి ఫెయిలై.. పదహారో ఏట ఆటోవాలా అవతారం ఎత్తిన రాజ్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు. అతని కథేంటో ఒకసారి చూద్దామా?


జైపూర్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజ్‌ను తల్లిదండ్రులు బడిలో చేర్పించారు. కానీ అతనికి చదువు అబ్బలేదు. స్కూలు మీద రాజ్‌కు ఆసక్తి లేదు. ఈ క్రమంలోనే పదో తరగతి కూడా ఫెయిలైపోయాడు. అయితే పింక్ సిటీగా పేరొందిన జైపూర్‌కు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వారిని ఆకర్షించడం కోసం అక్కడి కొందరు ఆటోవాలాలు ఇంగ్లీషు, ఫ్రెంచి, స్పానిష్ భాషలు మాట్లాడటం రాజ్ గమనించాడు. అది చూసి ఇంప్రెస్ అయిపోయి, తను కూడా ఇంగ్లీషు నేర్చుకోవాలని డిసైడయ్యాడు. కష్టపడి ఇంగ్లీషు నేర్చుకున్నాడు కూడా. ఆ తర్వాత టూరిజం వ్యాపారం పెట్టుకొని, విదేశీ ప్రయాణికులను జైపూర్ తిప్పడం ప్రారంభించాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతుండగా అనుకోకుండా జరిగిన ఓ ఘటన అతడి జీవితాన్నే మార్చేసింది. పర్యాటకురాలిగా విదేశం నుంచి వచ్చిన ఓ యువతి వల్ల అతడి లైఫ్ టర్నయింది. 


స్నేహితురాలితో కలిసి జైపూర్ చూడటానికి ఒక ఫ్రెంచి అమ్మాయి వచ్చింది. వాళ్ల ట్రావెల్ గైడ్‌గా ఉన్న రాజ్.. ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా రాజ్ చూపించే చొరవను, అతడి ప్రవర్తను చూసి ముచ్చటడపింది. ఆమె స్వదేశం వెళ్లిపోయిన తర్వాత కూడా ఇద్దరూ ఆన్‌లైన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. తను కూడా ఫ్రాన్స్ వెళ్లిపోదామని అనుకుంటే అతని అప్లికేషన్ చాలా సార్లు తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత మరోసారి ఆమె భారత్ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఎంబసీ ముందు బైఠాయించారు. దీంతో వాళ్లను కలిసిన అధికారులు మూడు నెలల టూరిస్టు వీసా ఇవ్వడంతో రాజ్ ఫ్రాన్స్ వెళ్లగలిగాడు. ఆ తర్వాత చాలా సార్లు ఫ్రాన్స్ వెళ్లాడు. 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు ఓ బాబు. లాంగ్ టర్మ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఫ్రెంచి నేర్చుకోవాలని అధికారులు చెప్పారట. దీంతో ఫ్రెంచి క్లాసులకు వెళ్లిన రాజ్ ఎట్టకేలకు లాంగ్ టర్మ్ వీసా కూడా సాధించాడు. ప్రస్తుతం భార్యాపిల్లలతో జెనీవాలో కాపురం ఉంటున్న రాజ్.. అక్కడ ఒక రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా వంటలు నేర్పుతూ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. ఎప్పటికైనా సొంతగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనేది రాజ్ కల. మనందరి తరఫున కూడా రాజ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి.Updated Date - 2021-06-21T18:11:38+05:30 IST