ముస్లిం రోగి చెవిలో హిందూ డాక్టర్ కలీమా.. సోషల్ మీడియాలో సునామీ!
ABN , First Publish Date - 2021-05-22T02:02:58+05:30 IST
వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మాయరోగం కులమతాలను దూరం చేసి అందరినీ దగ్గర చేస్తోంది. మతాల మధ్య అడ్డుగోడలను

కొచ్చి: వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మాయరోగం కులమతాలను దూరం చేసి అందరినీ దగ్గర చేస్తోంది. మతాల మధ్య అడ్డుగోడలను తొలగిస్తోంది. ఇటీవల ఇలాంటి ఉదంతాలు ఎన్నో వెలుగుచూశాయి. తాజాగా, హృదయాలను కదిలించే అలాంటి ఘటనే మరోటి జరిగింది.
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో సేవనా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో డాక్టర్ రేఖా కృష్ణ కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. అదే ఆసుపత్రిలో చేరిన ఓ ముస్లిం మహిళ ఆరోగ్యం రోజురోజుకు మరింత దిగజారింది. ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో డాక్టర్ రేఖ ముస్లిం ప్రేయర్‌గా మారి ఆమె చెవిలో కలీమా (లా ఇలాహా ఇల్లల్లా, ముహమ్మద్ రసూలుల్లా) వినిపించారు. ఆ తర్వాత ఆ రోగి దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచారు. తర్వాత కాసేపటికే కన్నుమూశారు.
డాక్టర్ కృష్ణ ఈ విషయాన్ని తన సహచర వైద్యుడికి చెబితే ఆయన ఈ విషయం మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వెంటనే డాక్టర్ రేఖా కృష్ణను ప్రశంసిస్తూ అభినందనలు పోటెత్తాయి. స్పందనలు సునామీని తలపించాయి.
కొవిడ్ రోగి గురించి డాక్టర్ రేఖ మాట్లాడుతూ.. కరోనా బారినపడి ముస్లిం మహిళ రెండు వారాలకు పైగా వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్నట్టు చెప్పారు. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు చేతులెత్తేశారు. వెంటిలేటర్ తొలగించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరికొన్ని క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయే అవకాశం ఉండడంతో డాక్టర్ రేఖా కృష్ణ ఇస్లాం ప్రేయర్ అవతారమెత్తారు. ఆమె చెవిలో కలీమా వినిపించారు.
నిజానికి అలా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదని, అప్పటికప్పుడు అలా చేయాలనిపించడంతో వెంటనే చేశానని డాక్టర్ రేఖ తెలిపారు. తాను దుబాయ్‌లో పుట్టిపెరిగానని, కాబట్టి ముస్లింల ఆచారాలు తనకు తెలుసని అన్నారు. తాను గల్ఫ్‌లో ఉండగా తన ఆచారాల కారణంగా ఎప్పుడూ వివక్షకు గురికాలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తాను చేసినది మతానికి సంబంధించినది అనుకోవద్దని, దానిని మానవీయ చర్యగా చూడాలని అన్నారు.
ముస్లి రోగి చెవిలో కలీమా పఠించిన డాక్టర్ కృష్ణను ముస్లిం స్కాలర్లు అభినందిస్తున్నారు. ఆమె చర్య మనసును ద్రవించిందని పలువురు పేర్కొన్నారు. మత సామరస్యానికి డాక్టర్ రేఖా కృష్ణ ప్రతీక అని కొనియాడుతున్నారు.