ఉబ్బెత్తుగా ఉన్న మాస్క్‌తో కంగారు పడుతున్న అతన్ని చూసిన కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-11-21T16:05:58+05:30 IST
మహారాష్ట్రలోని పూణె, పింపరీ- చింద్వాడాలలో..

మహారాష్ట్రలోని పూణె, పింపరీ- చింద్వాడాలలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల కోసం శుక్రవారం రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఒక అభ్యర్థి హైటెక్ పద్ధతిలో కాపీ చేసేందుకు ప్లాన్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎగ్జామినేషన్ సెంటర్ లోనికి వెళుతున్నప్పుడే పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ అభ్యర్థి మాస్క్ లోపల ఒక హియరింగ్ డివైస్ పెట్టుకుని వచ్చాడు. ఈ డివైస్‌లో ఒక బ్యాటరీ, ఒక కెమెరా, ఒక సిమ్ కార్డ్ సెట్ ఇన్‌బిల్ట్ చేసివున్నాయి. ఆ అభ్యర్థి ఫొటో తెస్తానని చెబుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన హింజోవాడీ బ్లూ రిచ్ సెంటర్‌లో జరిగింది. ఫింపరీ- చింద్వాడా పోలీసు కమిషనర్ కృష్ణాయాదవ్ మాట్లాడుతూ శుక్రవారం మొత్తం 720 కానిస్టేబుళ్ల నియామకం కోసం 80 కేంద్రాల్లో లిఖిత పరీక్షలు జరిగాయన్నారు. మొత్తం 1.89 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు.
పరీక్షాకేంద్రాల్లో తాము తనికీలు చేస్తుండగా ఒక ’హైటెక్ మున్నాభాయ్‘ని పట్టుకున్నామన్నారు. అతని మాస్క్ చూసిన కానిస్టేబుల్ కు అనుమానం రావడంతో ఆ అభ్యర్థిని పట్టకున్నారన్నారు. ఈ లిఖత పరీక్ష రాయడానికి ముందు అభ్యర్థులను తనిఖీలు చేస్తున్నప్పుడు, ఆ అభ్యర్థిని మాస్క్ తీయమని కోరామన్నారు. ఆ తరువాత ఆ అభ్యర్థి అడ్మిట్ కార్డుపై ఫొటో అతికించాలని, పెన్ను తీసుకురావాలని చెబుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత ఆ అభ్యర్థి తిరిగి రాలేదు. అయితే ఆ అభ్యర్థి మాస్క్‌ను స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ దానిని పరిశీలించారు. మాస్క్ లోపలి లేయర్‌లో మొబైల్ ఫోను ప్యానల్ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీని సాయంతో అతను పరీక్షలో కాపీ రాయాలని భావించాడని, అయితే తాము మాస్క్ స్వాధీనం చేసుకోవడంతో ఆ అభ్యర్థి అక్కడి నుంచి ఉడాయించాడన్నారు.