ఇంట్లో దూరి మరీ సొంత అల్లుడిపై కాల్పులు జరిపిన మామ.. అసలెందుకిలా చేశాడంటే..

ABN , First Publish Date - 2021-10-28T12:54:16+05:30 IST

బీహార్ రాష్ట్రంలోని మోతిహారి పట్టణంలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన కూతురి భర్తను పట్టపగలు ఇంట్లో దూరి మరీ కాల్చి చంపాడు. అల్లడని కనికరం కూడా చూపలేదు. అంతే కాదు.. అడ్డుగా వచ్చిన అతని తల్లిదండ్రులను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. సొంత అల్లుడని చూడకుండా అంత కిరాతకంగా చంపడానికి అసలు కారణం...

ఇంట్లో దూరి మరీ సొంత అల్లుడిపై కాల్పులు జరిపిన మామ.. అసలెందుకిలా చేశాడంటే..

బీహార్ రాష్ట్రంలోని మోతిహారి పట్టణంలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన కూతురి భర్తను పట్టపగలు ఇంట్లో దూరి మరీ కాల్చి చంపాడు. అల్లడని కనికరం కూడా చూపలేదు. అంతే కాదు.. అడ్డుగా వచ్చిన అతని తల్లిదండ్రులను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. సొంత అల్లుడని చూడకుండా అంత కిరాతకంగా చంపడానికి అసలు కారణం ఏమిటంటే..


మోతిహారీలో నివసించే అవినాశ్, పక్క గ్రామంలో నివసించే పూజతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పూజ ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. అవినాశ్, పూజ కుటంబసభ్యుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నారు. దీంతో పూజ తండ్రి, సోదరులు అవినాశ్‌ని చంపేస్తామని బెదిరించేవారు.


తన తండ్రి ఆవేశపరుడని, ఏమైనా చేయగలడని పూజ భయపడేది. అవినాశ్‌ని కుటుంబసభ్యులతో సహా చంపేస్తామని పూజ సోదరులు బెదిరించారు. ఒకసారి పూజ తండ్రి తన కుల పెద్దలతో పంచాయితీ పెట్టించి.. ఇప్పటికైనా పూజకు విడాకులు ఇవ్వాలని.. లేకపోతే ఫలితం దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. దీంతో అవినాశ్, పూజ కొద్ది కాలం వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. సంవత్సరం తరువాత తిరిగి వచ్చారు. వారిద్దరికీ ఇప్పుడు ఒక పాప కూడా జన్మించింది. పాపకు ప్రస్తుతం ఎనిమిది నెలల వయసు.


అవినాశ్, పూజ తిరిగి వచ్చారని తెలిసి పూజ తండ్రి మళ్లీ గొడవ చేశాడు. ఈ సారి ప్రాణాలతో చంపేస్తానని బెదిరించాడు. దీంతో అవినాశ్, పూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అలా ఒకరోజు ఉదయం అవినాశ్ ఇంట్లోనే ఉండగా.. పూజ తండ్రి, 12 మందిని వెంటతీసుకొని వచ్చాడు. ఇది గమనించిన అవినాశ్.. వెంటనే ఇంటి తలుపులు మూసేశాడు. ఆ సమయంలో ఇంట్లో అవినాశ్ తల్లిదండ్రులు, తమ్ముడు, పూజ, ఎనిమిది నెలల పాప ఉన్నారు. పూజ తండ్రితో వచ్చిన ఆ 12 మంది తలుపులతో పాటు ఇంటి గోడని కూల్చారు. ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి అవినాశ్‌ని చితకబాదారు. అడ్డు వచ్చిన అవినాశ్ తల్లిని బలంగా కొట్టారు. అతని తండ్రి కాలు విరిచేశారు, తలపై బలంగా కొట్టారు. అవినాశ్ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. అతను బయటికి రాకుండా ఒక గదిలో ఉంచి తాళం వేశారు. 


ఆ తరువాత పూజను కొట్టి.. ఆమె ఎదుటే అవినాశ్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. అవినాశ్ శరీరంతో ఎన్నో తూటాలు చొచ్చుకుపోయాయి. ఆ తరువాత పూజను అక్కడే వదిలేసి.. ఆమె పాపను తీసుకొని వెళ్లిపోయారు. పూజ తండ్రితో వచ్చిన మూక విధ్యంసం సృష్టించి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు అవినాశ్, అతని తల్లిదండ్రులని ఆస్పత్రికి చేర్చారు. అవినాశ్ తల్లి పరిస్థితి విషమించడంతో ఆమెను ఐసీయూలో ఉంచారు. అవినాశ్ తండ్రి కాలు ఎముకలు విరిగిపోయాయి, తలపై బలమైన గాయం ఉంది. 


ఇంత జరిగాక పూజ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిన ఘోరం గురించి ఫిర్యాదు చేసింది. తన పాపను బలవంతంగా తీసుకుపోయారని వాపోయింది.  పోలీసులు పూజ తండ్రి, సోదరులపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యకరం. మరుసటి రోజు పూజ మేనమామ పాపను తీసుకొచ్చి తల్లివద్దకు చేర్చాడు. ప్రస్తుతం పూజ తన తండ్రి, సోదరులకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. పోలీసులు ఇదొక పరువుహత్య కేసుగా పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.


Updated Date - 2021-10-28T12:54:16+05:30 IST