తల్లి వైద్య ఖర్చుల కోసం.. 14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పసిడి పతకం! సెలెబ్రిటీ స్టేటస్‌తో సతమతం!

ABN , First Publish Date - 2021-08-10T23:59:18+05:30 IST

ఆమె వయసు పద్నాలుగేళ్లే.. చాలా చిన్నవయసు..! కానీ ఇంతటి చిరుప్రాయంలోనే ఆమె ప్రపంచప్రఖ్యాతి గాంచింది. కానీ..

తల్లి వైద్య ఖర్చుల కోసం.. 14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పసిడి పతకం! సెలెబ్రిటీ స్టేటస్‌తో సతమతం!

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 14 ఏళ్లే.. చాలా చిన్నవయసు..! కానీ ఇంతటి చిరుప్రాయంలోనే ఆమె ప్రపంచప్రఖ్యాతి గాంచింది. ఒలింపిక్స్‌ డైవింగ్ పోటీల్లో బంగారు పతకం గెలిచి మొత్తం క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎవరా ఈ బాలిక అనుకుంటున్నారా..? ఈ చిచ్చర పిడుగు పేరు.. క్వాన్ హాంగ్‌చాన్! చైనాలోని గ్వాడాంగ్ ప్రావిన్సులోని ఓ కుగ్రామం ఆమె స్వస్థలం. 


క్వాన్‌ది చాలా సామాన్యమైన కుటుంబం. ఆమె జీవితంలో ఆర్థికకష్టాలు సర్వసాధారణం. దీనికి తోడు 2017లో ఆమె తల్లికి జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా ఆరోగ్యసమస్యలు వచ్చిపడ్డాయి. కుటుంబానికి ఆమె వైద్య ఖర్చులు భారంగా మారిపోయాయి. దీంతో.. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఏదో విధంగా ఆదుకోవాలనే తలంపుతో క్వాన్ క్రీడలను ఎంచుకుంది. స్కూల్ విద్యార్థుల కోసం ఎండాకాలం సెలవుల్లో  ఏర్పాటైన శిక్షణ శిబిరం ద్వారా డైవింగ్‌లో ఆమె టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అలా మొదలైన ఆమె ప్రయాణం చివరికి టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకునే దాకా వెళ్లింది.


ఇలా సామాన్య నేపథ్యం నుంచి పసిడి పతకం ఒడిసి పట్టేదాకా సాగిన క్వాన్ ప్రయాణం ఆమెను చైనాలో ఓ సెలెబ్రిటీని చేసింది. చైనాకు ఇంత పేరు ప్రతిష్ఠలు తెచ్చిన ఆమెను ఆర్థికంగా ఆదుకునేందుకు  అనేక మంది భారీ నజరానాలు ప్రకటించారు. ఫ్లాట్లను బహుమానంగా ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ‘‘30 వేల డాలర్ల విలువైన వాణిజ్య స్థలాన్ని ఇస్తామంటూ ఒకరు ముందుకు వచ్చారు. మరి కొందరు ఫ్లాట్ ఇస్తామన్నారు. కానీ వీటిని మేం తిరస్కరించాం’’ అని క్వాన్ తండ్రి స్థానిక మీడియాకు తెలిపారు. క్వాన్ తండ్రి బత్తాయి పళ్లను పండిస్తుంటారు. వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతోనే కుంటుంబాన్ని పోషిస్తుంటారు. 


మరోవైపు.. ఒక్కసారిగా వచ్చిపడ్డ పాపులారిటీతో రాక్‌స్టార్‌గా మారిన క్వాన్‌ను చూసేందుకు చైనా నలువైపుల నుంచి సందర్శకులు ఆమె గ్రామానికి పోటెత్తుతున్నారు.  క్వాన్‌తో సెల్ఫీలు దిగేందుకు, ఇంటర్వ్యూలు తీసుకునేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు క్యూకడుతున్నారు. వీరంతా ఆమె కోసం వేచిచూస్తూ రాత్రిళ్లు గ్రామంలో హడావుడి సృష్టిస్తున్నారు. నిత్యం ప్రశాంతంగా ఉండే గ్రామంలో సందర్శకుల హడావుడి కారణంగా ప్రశాంతత కరువైపోయింది. అక్కడి వృద్ధులకు రాత్రిళ్లు నిద్రకూడా కరువైపోయింది. దీంతో..తమ గ్రామానికి సందర్శకులు ఎవరూ రావద్దంటూ క్వాన్ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అయితే.. పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల్లో ప్రజలు మాకు శుభాకాంక్షలు చెబితే చాలు. ఇక్కడిదాకా రావాల్సిన అవసరం లేదు. దీని వల్ల మీకు, మాకూ ఇబ్బంది కలుగుతోంది. మాకు బహుమతులు కూడా అవసరం లేదు.’’ అని క్వాన్ తండ్రి కోరారు.  

Updated Date - 2021-08-10T23:59:18+05:30 IST