నకిలీ మహిళా వకీల్... డిగ్రీ లేకుండానే ప్రాక్టీస్... బార్ ఎన్నికల్లో విజయం!
ABN , First Publish Date - 2021-07-24T17:53:01+05:30 IST
కేరళకు చెందిన ఒక మహిళ డిగ్రీ లేకుండానే...

తిరువనంతపురం: కేరళకు చెందిన ఒక మహిళ డిగ్రీ లేకుండానే లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఉదంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని అలెప్పీకి చెందిన శశి జేవియర్ అనే మహిళ ఎల్ఎల్బీ డిగ్రీ చేయకుండానే, బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకుని, రెండేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంతకాలమైనా ఎవరికీ ఆ నకిలీ మహిళా వకీల్‌పై అనుమానం రాకపోవడం విశేషం. తాజాగా శశి జేవియర్‌పై అలెప్పీ బార్ అసోసియేషన్ కార్యదర్శి అభిలాష్ సోమన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో శశి జేవియర్ లా డిగ్రీ చేయకుండానే రెండేళ్లుగా లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఆ నకిలీ మహిళా వకీల్ 2019లో అలెప్పీ బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం సంపాదించడమే కాకుండా, బార్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. లైబ్రేరియన్‌గా ఎంపికయ్యారు. కాగా అధికారుల విచారణలో ఆమె తిరువనంత పురానికి చెందిన లాయర్ ఎకనాలెడ్జ్మెంట్తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పరారైన ఆమెను వెదికే పనిలో పడ్డారు.