డ్రైవింగ్‌ చేస్తూ ఎలక్ట్రిక్‌ కారు చార్జింగ్‌

ABN , First Publish Date - 2021-10-28T08:55:15+05:30 IST

వాతావరణ కాలుష్యానికి చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వాలు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో.. ఈ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వీటి..

డ్రైవింగ్‌ చేస్తూ ఎలక్ట్రిక్‌ కారు చార్జింగ్‌

సరికొత్త సాంకేతికతను రూపొందించిన ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ 

వాతావరణ కాలుష్యానికి చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వాలు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో.. ఈ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వీటి వినియోగంలో  ఓ సమస్య వేధిస్తోంది. అదే చార్జింగ్‌. వాహనంలో తగినంత చార్జింగ్‌ లేకపోతే.. ఎక్కడ ఆగిపోతుందో.. అనే ఆందోళన. దీన్ని అధిగమించేందుకు త్వరలో డైనమిక్‌ చార్జింగ్‌ విధానం అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో కారు డ్రైవింగ్‌ చేస్తూనే ఛార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం కొన్ని యూరప్‌ దేశాల్లో ప్రయోగదశలో ఉన్న ఈ పరిజ్ఞానం ప్రకారం.. కారులో అమర్చిన అన్‌బోర్డ్‌ యూనిట్‌కు ఇంటర్‌నెట్‌ అనుసంధానమై ఉంటుంది. రోడ్ల కింద అమర్చిన చార్జింగ్‌ ప్యాడ్స్‌ సహాయంతో.. డ్రైవింగ్‌ చేస్తూనే చార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇందులోనూ ఓ సమస్య ఉంది. చార్జింగ్‌ సమయంలో వ్యక్తిగత సమాచార చౌర్యానికి అవకాశం ఉంది. 


ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా చార్జింగ్‌ సమయంలో వ్యక్తిగత సమాచార చౌర్యానికి చెక్‌ పడుతుందని చెబుతున్నారు. ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌లోని కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగం ఇంజనీరింగ్‌ శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.గౌతంరెడ్డి సారథ్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14.5 కోట్ల ఎలక్ర్టిక్‌ వాహనాలు వినియోగంలో ఉంటాయని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అంచనా.    ఈ పరిశోధన.. ప్రముఖ అంతర్జాతీయ వాహన సాంకేతిక పరిజ్ఞాన జర్నల్‌లో ప్రచురితమైంది.                  

 -స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-10-28T08:55:15+05:30 IST