స్పూత్నిక్, కొవాగ్జిన్, కొవిషీల్డ్.. ఈ మూడు కరోనా వ్యాక్సిన్ల ప్రభావమెంత..? సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-05-21T19:56:27+05:30 IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై చాలా రోజులు జరిగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంలో మాత్రం పెద్దగా మార్పులేదు. ఇప్పుడు తాజాగా దేశంలోకి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని తొలి డోసును హైదరాబాద్‌లో వేశారు.

స్పూత్నిక్, కొవాగ్జిన్, కొవిషీల్డ్.. ఈ మూడు కరోనా వ్యాక్సిన్ల ప్రభావమెంత..? సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటంటే..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై చాలా రోజులు జరిగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంలో మాత్రం పెద్దగా మార్పులేదు. ఇప్పుడు తాజాగా దేశంలోకి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని తొలి డోసును హైదరాబాద్‌లో వేశారు. ఇప్పుడు భారతీయులు వ్యాక్సిన్ వేయించుకోవాలంటే అందుబాటులో ఉన్న మూడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకూ కోవాగ్జిన్ , కొవిషీల్డ్ మాత్రమే ఆప్షన్లుగా ఉన్న ప్రజలకు తాజాగా స్పూత్నిక్ కూడా అందుబాటులోకి రావడతో కొంత ఊరట లభిస్తోంది. ఈ మూడు వ్యాక్సిన్లతో దేశంలోని మరింత మంది ప్రజలకు వ్యాక్సిన్ లభించే అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో ఈ మూడు వ్యాక్సిన్లు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వీటిని తీసుకోవడం మంచిదేనా? అనే సందేహాలు కలుగక మానవు. మరి వీటి సైడ్ ఎఫెక్టుల వివరాలు చూసేద్దామా?


1. స్పుత్నిక్:

రష్యాలో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌పై 91.6శాతం ప్రభావం చూపుతందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 21 రోజుల నుంచి 3 నెలలలోపు రెండో డోసు తీసుకోవాలట. వైరల్ వెక్టార్ రకానికి చెందిన ఈ వ్యాక్సిన్‌ను ద్రవరూపంలో ఉంటే -18.55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో, వ్యాక్సిన్ డ్రైగా ఉంటే 2 నుంచి 8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలని నిపుణులు తెలిపారు. దీని ధరను భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా దీని ఒక్కో డోసును సుమారు 10 డాలర్లకు అమ్ముతున్నారు. 


స్పుత్నిక్ వల్ల ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్టులూ ఇప్పటి వరకూ బయటపడలేదని సమాచారం. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరంలో యాంటీబాడీల నియామకం సులభంగా జరుగుతుందట. అయితే ఈ ఇంజెక్షన్ చేయించుుకన్న ప్రాంతంలో, కొద్దిగా దద్దుర్లు, నొప్పి, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయి. కొన్ని చోట్ల హైపర్ టెన్షన్, హేమరేజి స్ట్రోక్, ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి గానీ ఇది చాలా అరుదుగా జరిగిన ఘటన.


2. కోవాగ్జిన్

భారత్‌లో తయారు చేసిన రెండు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి. నిజమైన కరోనా కణాలతో ఎలా పోరాడాలో శరీరానికి నేర్పడం ద్వారా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్‌పై 81శాతం వరకు ప్రభావం చూపుతుందని సర్వేల్లో వెల్లడయింది. ఇనాక్టివ్ వేరియస్ రకానికి చెందిన ఈ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 4 నుంచి 8 వారాల్లో రెండో వ్యాక్సిన్ డోసు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ప్రభుత్వానికి రూ.600 పడుతుంది. ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం ఇది ఒక్కో డోసు రూ.1200కు అమ్ముతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే రూ.250కు అందిస్తున్న ఈ వ్యాక్సిన్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఉచితం.


ఇది తీసుకున్న వారిలో కూడా ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో దద్దుర్లు, ఎర్రగా మారడం, వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీనికితోడు కొందరిలో జ్వరం, బాగా చెమటలు పోయడం, వణుకు, ఒళ్లు నొప్పులు, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు సమాచారం.


3. కోవిషీల్డ్

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ఇది కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్‌లాగే వైరల్ వెక్టార్ రకానికి చెందిన వ్యాక్సిన్. రెండు డోసుల ఈ వ్యాక్సిన్.. తొలి డోస్ తీసుకున్న 12 వారాల తర్వాత రెండో వ్యాక్సిన్ తీసుకోవచ్చని సమాచారం. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతతలో నిల్వ ఉంచొచ్చు. అలా ఉంచినా కూడా 6 నెలల తర్వాత ఈ వ్యాక్సిన్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌పై 70.4శాతం వరకు ప్రభావం చూపుతుంది. అయితే మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య గ్యాప్ పెంచినట్టయితే ఈ వ్యాక్సిన్ 90శాతం వరకు ప్రభావం చూపగలుగుతుందని సర్వేల్లో వెల్లడయింది. రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.300 పడుతుంది. ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో వ్యాక్సిన్ డోసు రూ.600కు అమ్ముడవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.250కు లభించే ఈ వ్యక్సిన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా లభిస్తోంది.


ప్రస్తుతం 62 పైగా దేశాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వాడకంలో ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత  ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో కొద్దిగా ఎరుపు, ఒక మాదిరి నుంచి హైఫీవర్, నీరసం, చేతులు పట్టేయడం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా కనిపించాయి. కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తం గడ్డకట్టినట్లు తెలిసినా.. ఇది చాలా అరుదుగా జరిగినట్లు సమాచారం.


ఇక ఈ వ్యాక్సీనుల్లో ఏది ప్రజలకు త్వరగా అందుబాటులో ఉంటే అదే ప్రస్తుతం పెట్టుకుంటే మంచింది. ఏది తీసుకున్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి. ఏది ఏమైనా ఈ మూడింటి వల్ల దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుందని అంచనా. మరెందుకు ఇక ఆలస్యం మనం కూడా ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకుంటే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరూ వ్యాక్సిన్ మిస్ కాకుండా తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.

Updated Date - 2021-05-21T19:56:27+05:30 IST