ముగ్గురు భర్తలకు విడాకులు.. తనపై అత్యాచారానికి పాల్పడిన వాడితో కలిసి ఆ మహిళ పక్కా స్కెచ్..!
ABN , First Publish Date - 2021-08-25T20:14:22+05:30 IST
రెండేళ్ల క్రితం అతన్ని అత్యాచారం కేసులో జైలుకు పంపిందామె. బెయిలుపై బయటకొచ్చిన అతను ఆమెను కలిశాడు. అయితే ఆ తర్వాతే ఈ కథ ఊహించని మలుపు తిరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం అతన్ని అత్యాచారం కేసులో జైలుకు పంపిందామె. బెయిలుపై బయటకొచ్చిన అతను ఆమెను కలిశాడు. అయితే ఆ తర్వాతే ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. వీళ్లిద్దరూ చేతులు కలిపి హనీ ట్రాప్ గ్యాంగ్ ప్రారంభించారు. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చని ఆ ఖైదీ చెప్పిన మాటలను ఆమె నమ్మింది. వీళ్లిద్దరూ కలిసి అమాయకులను మోసం చేయడం ప్రారంభించారు. ఈ వినూత్న ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసింది.
బోరానాడా ప్రాంతానికి చెందిన కిసాన్‌రామ్ అనే వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ హనీ ట్రాప్ గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. తమ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి సోదరి వరుస అయ్యే ఒక మహిళ తనను సాయం కోరిందని అతను చెప్పాడు. తన భార్యాపిల్లలకు కూడా ఆమె పరిచయం ఉందన్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 10న రాత్రిపూట ఏదో సమస్య చెప్పి కొంచెం భోజనం కావాలని సదరు డ్రైవర్ సోదరి అడిగిందట. దీంతో భోజనం తీసుకొని ఆమె ఇంటికెళ్లాడు కిసాన్‌రామ్. అక్కడకు వెళ్లిన కాసేపటికి అతనికి ఏదో మత్తు పదార్థం తినిపించడంతో స్పృహకోల్పోయాడు.
కాసేపటికి కళ్లు తెరిచి చూస్తే తాను ఒక మంచంపై అర్ధనగ్నంగా ఉన్నట్లు కిసాన్రామ్కు అర్థమైంది. అలాగే మరో వ్యక్తి తనను వీడియో తీస్తున్నట్లు కనిపించింది. ఏం జరుగుతుందో సరిగా అర్థంకాని స్థితిలో అతను వారిని ప్రశ్నించాడు. అంతే అతన్ని తీవ్రంగా కొట్టిన దుండగులు.. తమకు రూ.50 లక్షలు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన కిసాన్‌రామ్.. అప్పోసొప్పో చేసి రూ.5 లక్షలకు చెల్లించాడు. ఇంకా డబ్బు కావాలనడంతో చేతులెత్తేశాడు. పోలీసులను ఆశ్రయించాడు.
రెండేళ్ల క్రితం అత్యాచారం కేసు పెట్టినవాడితోనే..?
కిసాన్ రామ్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. ఈ కేసులో కిసాన్రామ్ను ఇరికించిన గ్యాంగ్‌లో మాస్టర్ మైండ్ ఫతే ఖాన్ అని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, అతనికి సహకరిస్తున్న యువతి.. గతంలో ఫతేఖాన్‌పై అత్యాచారం కేసు పెట్టిన యువతేనని తేలింది. అత్యాచారం కేసులో జైల్లో ఉన్న ఫతే ఖాన్.. బెయిలుపై బయటకొచ్చాడు. ఆ యువతితో అతనికి మంచి స్నేహం ఉంది. దీంతో ఆమెను కలిసి హనీ ట్రాప్ గ్యాంగ్ ఆలోచన చెప్పాడు. ఈ పనితో లక్షలు సంపాదించవచ్చని కలలు చూపించాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి దీనికి అంగీకరించింది.
ముగ్గురితో విడాకులు..
ఫతేఖాన్‌కు సహకరించిన యువతి.. ఇప్పటి వరకూ ముగ్గుర్ని పెళ్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫతేఖాన్‌పై కేసు పెట్టిన ఆమె.. ఆ తర్వాత ఈ ముగ్గురికీ ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఫతేఖాన్తోనే కలిసి హనీ ట్రాప్ గ్యాంగ్ ప్రారంభించింది. ఆమె కుమార్తె కూడా పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫతేఖాన్‌పై కూడా చాలా కేసులు ఉన్నాయని సమాచారం.
కిసాన్‌రామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫతేఖాన్తోపాటు సదరు యువతిని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
