కూరగాయలు సరిగా కోయడం రాదా.. అంటూ దుర్భాషలాడిన అత్త.. ఆ 26 ఏళ్ల కోడలు చేసిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-09-02T16:42:01+05:30 IST

అత్తా కోడళ్లది జన్మవైరం అంటుంటారు. అత్త ఏం చెప్పినా కోడలికి నచ్చదు.. కోడలేం చేసినా అత్తకు నచ్చదు..

కూరగాయలు సరిగా కోయడం రాదా.. అంటూ దుర్భాషలాడిన అత్త.. ఆ 26 ఏళ్ల కోడలు చేసిన దారుణమిది..!

అత్తా కోడళ్లది జన్మవైరం అంటుంటారు. అత్త ఏం చెప్పినా కోడలికి నచ్చదు.. కోడలేం చేసినా అత్తకు నచ్చదు.. ఇలాంటి ఓ చిన్న గొడవే పెద్ద వాగ్వాదంగా మారి చివరకు అత్త ప్రాణం తీసింది. కూరగాయలు సరిగ్గా కోయమంటూ దుర్భాషలాడిన అత్తపై కోడలు కత్తితో దాడి చేసింది.. తీవ్ర గాయాల పాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవికి, తన కోడలు మమతా దేవితో ఒక్క క్షణం పడేది కాదు. గత సోమవారం మమత కూరలు తరుగుతూ ఉంటే మోహిని అక్కడకు వచ్చి.. `కూరగాయలు సరిగా కోయడం రాదా..` అంటూ దుర్భాషలాడింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన మమత కూరగాయలు కోసే కత్తితో అత్తపై దాడి చేసింది. అత్త శరీరంపై 26 చోట్ల కత్తితో గాయాలు చేసింది. అనంతరం తన లగేజీ తీసుకుని ఇంటి నుంచి పరారైంది.


చుట్టుపక్కల వారు మోహిని కేకలు విని అక్కడకు వచ్చారు. గాయాలతో ఉన్న మోహినిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటూ మంగళవారం మరణించింది. దీంతో మోహినీ దేవి కొడుకు తన భార్యపై మర్డర్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మమతను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-09-02T16:42:01+05:30 IST