రోజూ తలస్నానం చేయడం మంచిదేనా..? అలా చేస్తే జుట్టు రాలుతుందా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..
ABN , First Publish Date - 2021-12-21T18:39:11+05:30 IST
ప్రతీ రోజూ తలస్నానం చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని కొంతమంది అపోహ పడుతుంటే... ఇంకొంత మంది వారానికోసారే చేయాలని సలహా ఇస్తారు
ప్రతీ రోజూ తలస్నానం చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని కొంతమంది అపోహ పడుతుంటే... ఇంకొంత మంది వారానికోసారే చేయాలని సలహా ఇస్తారు. ఇలాంటి భిన్నమైన వాదనలు ఉన్నాయి. చాలా మంది రోజూ తలస్నానం చేయకపోతే అనీజీగా ఫీలవుతారు. మరికొంత మంది తలనొప్పి అని బాధపడతారు. రోజూ తలస్నానం చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆలోచిస్తారు. అసలు రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? ఒకవేళ చేస్తే వెంట్రుకలు ఊడిపోతాయా? శిరోజాలు రాలిపోవడానికి గల కారణాలపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
సాధారణంగా రోజుకి రెండు సార్లు స్నానం చేయడం మంచిదని డాక్టర్లు సూచిస్తుంటారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. అంతేకాదు శరీరంపై ఉండే దుమ్ము, ధూళి పోతుంది. అలాగే వేడి నీళ్లతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాకుండా ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. అంటే రోజుకి రెండు సార్లు స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. కానీ రోజూ తలస్నానం చేయడం మంచిదా? కాదా? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం.
రోజూ తలస్నానం చేయడం అనేది జుట్టు యొక్క కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి. దుమ్ము, ధూళిలో తిరిగే వారు ప్రతీ రోజూ తలస్నానం చేస్తేనే మంచిది. జిడ్డు పోయి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. జుట్టు కుదళ్ల నుంచి నూనెలు స్రవిస్తాయి. దీంతో వెంట్రుకలు సహజంగా మెత్తగా, స్మూత్‌గా ఉంటాయి. కానీ రోజూ తలస్నానం చేయడం వల్ల నూనెలు స్రవించే శాతం తగ్గిపోతాయి. దీంతో శిరోజాలు పొడిబారిపోతాయి. అందువల్ల దుమ్ములో తిరగని వాళ్లు రోజూ తలస్నానం చేయకుంటేనే మంచిది. జుట్టు పొడిబారినప్పుడు రెగ్యులర్‌గా తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అలాగే విటమిన్-సి లోపం వల్ల కూడా జట్టు రాలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు వెంట్రుకల మొదళ్లు కూడా బలోపేతం అవుతాయి. ఇక ప్రతి రోజూ తలస్నానం చేయడం తప్పని పరిస్థితి అయితే మాత్రం షాంపూలు వాడే విషయంలో వైద్యులను సంప్రదిస్తే మంచిది. లేదంటే తీవ్రత తక్కువగా ఉండే షాంపూలు వాడితే ఉత్తమం.

ఇక కేశాలకు రంగు వేసుకున్న వాళ్లు దీర్ఘకాలం పనిచేయాలంటే రోజూ తలస్నానం చేయకుంటేనే మంచిది. అలాగే జుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్ వాడకుంటేనే మేలు. పురుషులైతే రోజు విడిచి రోజు, మహిళలైతే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. చాలా మంది తల జిడ్డుగా ఉంటుందని నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందాలంటే రోజూ నూనె పెట్టుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూలు పడితే ఆ షాంపూలు వాడకుంటేనే మంచిది. వీటి విషయంలో వైద్యుల సూచనలు పాటిస్తే క్షేమం.
