సీఎం కుమారుడి Wedding లో తాగి తందనాలాడిన ఖాకీలు

ABN , First Publish Date - 2021-10-14T16:12:29+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ కుమారుడి వివాహంలో పోలీసులు తాగి తందానాలాడిన ఉదంతం సంచలనం రేపింది...

సీఎం కుమారుడి Wedding లో తాగి తందనాలాడిన ఖాకీలు

మొహాలి: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ కుమారుడి వివాహంలో పోలీసులు తాగి తందానాలాడిన ఉదంతం సంచలనం రేపింది.సీఎం కుమారుడు నవజిత్ సింగ్ ఆదివారం మొహాలీలోని గురుద్వారాలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సిమరంధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లి సందర్భంగా మొహాలీలోని అరిస్టా రిసార్ట్‌లో నిర్వహించిన లేడీస్ సంగీత్ ఫంక్షన్‌లో భద్రతా లొసుగులు వెలుగుచూశాయి. సీఎం కుమారుడి వివాహ వేడుకలో యూనిఫాం ధరించిన పోలీసులు మద్యం తాగి ఉన్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి డీజీపీకి రాసిన లేఖలో వెల్లడించారు. 


పెళ్లి సందర్భంగా భద్రతా లొసుగులను లేఖలో ఎత్తి చూపారు. దీంతో దీనికి కారణమైన ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. వివాహ వేడుక ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు సరిగా లేకపోవడంతో సాయుధులు లోపలకు వచ్చారని డీజీపీకి అందిన లేఖలో వెల్లడైంది. పోలీసు దుస్తులు ధరించి మద్యం తాగారని తేల్చారు. గెజిటెడ్ ర్యాంకు పోలీసు అధికారి ఒకరు మంత్రికి పాదాభివందనం చేశారని కూడా లేఖలో రాశారు.వీఐపీలు వాహనాల నుంచి దిగేటపుడు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని వెల్లడైంది.


ముఖ్యమంత్రి ఛన్నీ భద్రత కోసం ఉన్న కమెండోలు ఫోన్లలో వీడియోలు చూస్తూ గడిపారు. సీఎం భద్రతా సిబ్బంది కూడా మద్యం తాగినట్లు గుర్తించారు.వివాహ వేడుక ప్రవేశ ద్వారాల వద్ద మోహరించిన పోలీసు సిబ్బంది ఫంక్షన్ ముగిసేలోపు డ్యూటీ పాయింట్లు వదిలి వెళ్లిపోయారని డీజీపీకి రాసిన లేఖలో సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.కొందరు అనధికార సిబ్బంది కూడా ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని దాటారని తేలింది.


Updated Date - 2021-10-14T16:12:29+05:30 IST