అంబానీ నుంచి అమీర్‌ఖాన్ వరకు.. వీళ్ల దగ్గరున్న కార్ల ధరలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ABN , First Publish Date - 2021-08-27T18:38:43+05:30 IST

సెలబ్రిటీల్లో చాలా మందికి లగ్జరీ కార్ల పిచ్చి ఉంటుంది. తాము సంపాదించే ఆదాయంలో అధికభాగాన్ని వాళ్లు కార్ల కోసమే ఖర్చు చేస్తారని అనడం అతిశయోక్తేమీ కాదు. ఈ మాటలకు నిదర్శనంగానే.. నిన్నగాక మొన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు కొన్న సంగతి తెలుసు కదా..!

అంబానీ నుంచి అమీర్‌ఖాన్ వరకు.. వీళ్ల దగ్గరున్న కార్ల ధరలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీల్లో చాలా మందికి లగ్జరీ కార్ల పిచ్చి ఉంటుంది. తాము సంపాదించే ఆదాయంలో అధికభాగాన్ని వాళ్లు కార్ల కోసమే ఖర్చు చేస్తారని అనడం అతిశయోక్తేమీ కాదు. ఈ మాటలకు నిదర్శనంగానే.. నిన్నగాక మొన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు కొన్న సంగతి తెలుసు కదా..! లంబోర్ఘినీ ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారు ఇది. భారత్‌లో ఈ కారు కొన్న తొలి వ్యక్తి తారక్. చాలా రోజుల క్రితమే తారక్ ఈ కారును బుక్ చేశాడట. కానీ దానికున్న భారీ డిమాండ్ కారణంగా ఈ మధ్యే కారు డెలివరీ అయింది. ఈ కారు ధర సుమారు 3.15 నుంచి 3.5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ కారు గురించి తెలియగానే చాలా మంది నోరెళ్లబెట్టారు. ఇంతకు నాలుగింతలు ఖరీదైన కార్లను మన దేశంలోని కొందరు సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నారన్న విషయం మీకు తెలుసా? మరెందుకాలస్యం ఆ కార్లేవి? ఆ యజమానులెవరు? ఒకసారి చూసేద్దామా..?


1. ముఖేష్ అంబానీ

భారతదేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ అంబానీ కుటుంబం దగ్గర 170 కార్లు ఉన్నాయని తెలుసా? వీటిలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ ఫాంటమ్ సిరీస్ VIII ఈడబ్ల్యూబీ ఒకటి. దీని మార్కెట్ ధర కనీసం రూ.13.5 కోట్లు ఉంటుందని అంచనా. దీంతోపాటు మెర్సిడెజ్ బెంజ్ ఎస్-గార్డ్ డబ్ల్యూ221 ఎస్600 కారు కూడా అంబానీ ఫ్యామిలీ వద్ద ఉంది. ట్విన్ టర్బోచార్జిడ్ వీ12 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ధర రూ.10.5 కోట్లట. వీటితోపాటు బెంట్లీ, రోల్స్ రాయ్స్ ఎస్‌యూవీ, ఫెరారీ వంటి పలు ఖరీదైన కార్లు కూడా వీళ్ల వద్ద ఉన్నాయి.


2. షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కార్లంటే మోజు ఎక్కువే. అందుకే ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటైన బుగాటి వేరాన్‌ను కొన్నాడాయన. దీని విలువ రూ.12కోట్లపైనే. వివిధ హైటెక్ ఫీచర్లతో వచ్చే ఈ కారు అత్యధికంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. షారుఖ్ కాకుండా ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, రాబర్టో కార్లో వంటి సెలెబ్రిటీలు ఈ కారు వాడుతున్నారు.


3. అమీర్ ఖాన్

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్.. ‘దంగల్’, ‘పీకే’, ‘త్రీఇడియట్స్’ వంటి చిత్రాలు ఎంతటి భారీ హిట్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో తొలిసారి 100 కోట్ల వసూళ్ల రాబట్టిన చిత్రం ‘గజిని’ కూడా అమీర్‌దే. మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా కనిపించే అమీర్.. మెర్సిడెజ్ బెంజ్ 600 కారు ఓనర్. మిగతా మెర్సిడెజ్ కార్లకు, దీనికి ఒక తేడా ఉంది. అదేంటంటే.. అమీర్ కొన్న కారు బాంబు ప్రూఫ్! ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం చేస్తున్న సమయంలో చంపేస్తామని బెదిరింపులు రావడంతోనే అమీర్ ఈ కారు కొన్నట్లు తెలుస్తోంది.


4. రూబెన్ సింగ్

లండన్‌లో ఉండే భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త రూబెన్ సింగ్. ఆయన ఒకేసారి ఏకంగా ఆరు కార్లు కొని వార్తల్లో నిలిచారు. అవి కూడా అల్లాటప్పా కార్లు కాదు. రోల్స్ రాయ్స్ లగ్జరీ కార్లు. వీటి విలువ ఎలా లేదన్నా రూ.50 కోట్లకుపైమాటే. ఆయన దగ్గర ఇప్పటికే 15కుపైగా రోల్స్ రాయ్స్ కార్లున్నాయి. ఈ కార్లు కొన్న తర్వాత ‘7 డేస్ రోల్స్ రాయ్స్ టర్బన్ ఛాలెంజ్’ విసిరిన రూబెన్ సింగ్.. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. తాను తలకు కట్టుకునే టర్బన్‌ను ఒక ఆంగ్లేయుడు ఎగతాళి చేయడంతో కోపం వచ్చిన సింగ్.. ఈ ఛాలెంజ్ చేశాడట. ఆయన దగ్గర రోల్స్ రాయ్స్‌తోపాటు బుగాటి వేరాన్, పోర్ష్ 918 స్పైడర్, పగానీ హయరా, లంబోర్ఘినీ హురాకన్, ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా తదితర కార్లు కూడా ఉన్నాయి.


5. అభిని సోహన్ రాయ్

యూఏఈకి చెందిన వ్యాపార వేత్త అభిని సోహన్ రాయ్. ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఏరీస్ గ్రూప్‌ వ్యవస్థాపకుడైన ఆయన.. 2018 మే నెలలో రోల్స్ రాయ్స్ కలినన్ కారు కొన్నాడు. తన పెళ్లయిన 25వ వార్షికోత్సవం సందర్భంగా.. భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసమే ఈ కారు కొన్నట్లు తెలుస్తోంది.


6. మయూర్ షా

అమెరికాకు చెందిన బిజినెస్‌మ్యాన్ మయూర్ షా.. బుగాటి చిరాన్ కారు ఉన్న ఏకైక భారతీయుడిగా ఆయనకు పేరుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన చిరాన్ ధర రూ.21 కోట్లు. తన తండ్రికి బహుమతిగా ఇవ్వడం కోసం ఈ కారును మయూర్ కొనుగోలు చేశారట. దీన్ని బుక్ చేసిన రెండేళ్లకుగానీ డెలివరీ రాలేదు. మయూర్ వద్ద పోర్ష్ జీటీ ఆర్ఎస్2, మెక్‌లారెన్ 720ఎస్, రోల్స్ రాయ్స్ డ్రాప్‌హెడ్ కూప్, లంబోర్ఘినీ అవెంటడార్ ఎస్‌వీహెచ్, పోర్ష్ జీటీ ఆర్ఎస్3 తదితర కార్లు కూడా ఉన్నాయట.


7. అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వద్ద ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ గురించి చాలా వార్తలే వచ్చాయి. వీటిలో రోల్స్ రాయ్స్ ఫాంటమ్ VII కూడా ఒకటి. దీన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా బహుబతిగా అమితాబ్‌కు అందించాడట. ఈ కారులో 6.75 లీటర్ల వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 


8. హృతిక్ రోషన్

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా లగ్జరీ కార్ల ప్రియుడే. ఆయన దగ్గర రోల్స్ రాయ్స్ ఘోస్ట్ సిరీస్ II కారు ఉంది. దీని ధర సుమారు రూ.7 కోట్లు ఉంటుందట. ఈ కారు బేస్ మోడల్ ధరే రూ.4.5 కోట్లతో ప్రారంభమవుతుంది. అయితే దీనిలో తన అభిరుచులకు అనుగుణంగా హృతిక్ ఎన్నో మార్పులు చేయించుకున్నాడట. అందుకే దీని ధన రూ.7 కోట్లకు చేరింది.

Updated Date - 2021-08-27T18:38:43+05:30 IST