కరోనా వ్యాప్తిని ఆపడానికి గోమూత్రం తాగండి...బీజేపీ ఎమ్మెల్యే సిఫారసు

ABN , First Publish Date - 2021-05-08T14:40:57+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆవు మూత్రం తాగాలని సూచించి ....

కరోనా వ్యాప్తిని ఆపడానికి గోమూత్రం తాగండి...బీజేపీ ఎమ్మెల్యే సిఫారసు

 లక్నో (ఉత్తరప్రదేశ్): దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆవు మూత్రం తాగాలని సూచించి సంచలనం రేపారు. కరోనాను ఓడించడానికి ప్రజలు గోమూత్రం తాగాలని బైరియా పట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. బాల్లియా జిల్లా బైరియా పట్టణంలో ఎమ్మెల్యే సురేంద్రసింగ్ గోమూత్రం తాగే వీడియోను కూడా విడుదల చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో సురేంద్రసింగ్ ఆవు మూత్రం ఎంత ఖచ్చితంగా తాగాలో చూపించారు. కొవిడ్ వ్యాప్తిని గోమూత్రం తాగడం ద్వారా నియంత్రించవచ్చని సురేంద్రసింగ్ పేర్కొన్నారు.


 ప్రజల కోసం తాను రోజుకు 18 గంటలు పనిచేసినా, అలసి పోవడం లేదని, తన ఆరోగ్య రహస్యం ఆవు మూత్రం తాగడమేనని సురేంద్రసింగ్ వివరించారు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసునీటిలో రెండు,మూడు కప్పుల ఆవు మూత్రం కలిపి తాగాలని సూచించారు.తాను సైన్సును నమ్ముతున్నానో లేదో గాని గోమూత్రాన్ని పూర్తిగా విశ్వసిస్తానని సురేంద్ర సింగ్ చెప్పారు. గోమూత్రం తాగాక అరగంట వరకు ఏదైనా తినవద్దని, ఈ గోమూత్రం గుండెజబ్బులకు వ్యతిరేకంగా సూపర్ పవర్ అని, దీనివల్ల పలు వ్యాధులు నయమవుతాయని బీజేపీ ఎమ్మెల్యే వివరించారు.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పసుపుపొడి వాడాలని సురేంద్రసింగ్ సిఫారసు చేశారు. 

Updated Date - 2021-05-08T14:40:57+05:30 IST