పేదరికంలోకి 10 కోట్ల మంది... బిలియనీర్ల సంపద పైపైకి...

ABN , First Publish Date - 2021-12-08T02:09:49+05:30 IST

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచంలో సంపన్నుల

పేదరికంలోకి 10 కోట్ల మంది... బిలియనీర్ల సంపద పైపైకి...

పారిస్ : కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచంలో సంపన్నుల సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. 1995 నుంచి బిలియనీర్ల సంపద 1 శాతం నుంచి 3 శాతానికి పెరిగింది. 2020లో ప్రపంచ బిలియనీర్ల సంపద వాటా అత్యధికంగా పెరిగింది. అదే సమయంలో సుమారు 10 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు. మంగళవారం విడుదలైన వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది. 


కోవిడ్ మహమ్మారి సమయంలో బిలియనీర్ల సంపద విలువ పెరుగుదల మరింత పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ సంపదలో బిలియనీర్ల వాటా అత్యధికంగా 2020లో పెరిగినట్లు వివరించింది. 1995 నుంచి వచ్చిన అదనపు సంపదలో మూడో వంతుకు పైగా అత్యంత సంపన్నులైన 1 శాతం మందికి చేరిందని తెలిపింది. అడుగున ఉన్న 50 శాతం మందికి కేవలం రెండు శాతం మాత్రమే చేరిందని పేర్కొంది. 


52 మంది సంపన్నుల సంపద విలువ గడచిన 25 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 9.2 శాతం చొప్పున పెరిగినట్లు తెలిపింది. తక్కువ సంపన్నులైన సాంఘిక వర్గాల సంపద విలువలో పెరుగుదల కన్నా అధికంగా వీరి సంపద పెరిగింది. వర్క్ నుంచి టోటల్ గ్లోబల్ ఇన్‌కమ్‌లో మహిళల వాటా 35 శాతం కన్నా తక్కువ, అయితే ఇది 1990లో సుమారు 30 శాతం ఉండేది. పురుషులతో సమానంగా మహిళల సంపద విలువ పెరగలేదు.


యూరోప్‌లో సమానత్వం...

ప్రపంచంలో అత్యధిక సమానత్వం ఉన్న ప్రాంతం యూరోప్. ఆదాయంలో ఇక్కడి 10 శాతం మంది సంపన్నుల వాటా 36 శాతం. అదేవిధంగా మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా చాలా అసమానతలుగల ప్రాంతం. ఆదాయంలో ఇక్కడి 10 శాతం మంది సంపన్నుల వాటా 58 శాతం.


పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లోని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ కో డైరెక్టర్, ఈ నివేదిక రూపకర్తల్లో ఒకరు అయిన ల్యూకాస్ చాన్సెల్ మాట్లాడుతూ, సుమారు 18 నెలలపాటు సాగిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచం మరింత కేంద్రీకృతమైందని చెప్పారు. బిలియనీర్ల సంపద 4 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగిందన్నారు. అదే సమయంలో సుమారు 100 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకున్నారన్నారు. అంతకుముందు 25 ఏళ్ళపాటు అత్యంత తీవ్రస్థాయి పేదరికం తగ్గుతూ వచ్చిందన్నారు. పేదరికంపై పోరాటంలో ప్రభుత్వాల జోక్యం తప్పనిసరి అని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో సంపన్న దేశాలు మరింత ఎక్కువగా కృషి చేయగలిగాయన్నారు. సంపన్న దేశాలు తమ ప్రజలకు సాంఘిక భద్రత కోసం ఆర్థిక సాయం చేశాయని, తక్కువ వనరులుగల దేశాలు ఇటువంటి చర్యలు చేపట్టలేకపోయాయని చెప్పారు. 


కుబేరులపై పన్నుతో ప్రభుత్వాలకు ఆదాయం

ప్రపంచ కుబేరుల నుంచి కొంత సంపద పన్నును వసూలు చేసి, సంపదను పునఃపంపిణీ చేయాలని ఈ నివేదిక పిలుపునిచ్చింది. నామమాత్రంగా పన్ను వసూలు చేసినప్పటికీ, ప్రభుత్వాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం వస్తుందని తెలిపింది. 


ఫోర్బ్స్ మ్యాగజైన్ ర్యాంకింగ్ ప్రకారం, టాప్ 10 సంపన్నుల్లో ఒక్కొక్కరికీ 100 బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉంది. వీరందరిలో ఎలన్ మస్క్ సంపద విలువ దాదాపు 265 బిలియన్ డాలర్లు. Updated Date - 2021-12-08T02:09:49+05:30 IST