ఆరేళ్ల కూతుర్ని చంపేశారంటూ సొంత సోదరులపైనే కేసు పెట్టాడో తండ్రి.. చివరకు షాకింగ్ ట్విస్ట్

ABN , First Publish Date - 2021-07-03T17:21:04+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన ఆరేళ్ల కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు బీహార్‌కు చెందిన అలామ్.

ఆరేళ్ల కూతుర్ని చంపేశారంటూ సొంత సోదరులపైనే కేసు పెట్టాడో తండ్రి.. చివరకు షాకింగ్ ట్విస్ట్

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన ఆరేళ్ల కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు బీహార్‌కు చెందిన అలామ్. దర్యాఫ్తు మొదలు పెట్టిన పోలీసులు కొద్ది రోజులకు ఓ చెరుకు తోటలో ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. తన సోదరులు రుస్తుమ్, సబిర్‌లకు తనతో పడడం లేదని, వారే ఆమెను చంపేసి ఉంటారని అలామ్ పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రుస్తుమ్, సబిర్‌లను అరెస్ట్ చేశారు. విచారణ సాగుతున్న దశలో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. అసలు నిందితుడు అలామ్ అని తేలింది. 


సోదరుల ఆస్తిని కాజేసేందుకు అత్యంత కిరాతకంగా కన్న కూతురినే అలామ్ చంపేశాడని తేలింది. దీంతో అలామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ సాగించారు. పోలీసుల కథనం ప్రకారం.. తనకు చెందిన భూమిని అమ్ముతానని చెప్పి అదే గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి అలామ్ రూ.8 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ భూమి అలామ్‌ది కాదు.. సోదరుడు రుస్తుమ్‌ది. ఆ విషయం భూమి కొన్న వ్యక్తికి తెలియడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని, లేకపోతే కేసు పెడతానని బెదిరించాడు. దీంతో అలామ్ ఓ పథకం రచించాడు. 


తన కూతురిని చంపేసి ఆ కేసులో సోదరులను ఇరికిస్తే, ఆ భూమి తన స్వంతమవుతుందని అనుకున్నాడు. దీంతో తన కూతురిని గొంతు నులిమి చంపేసి చెరుకు తోటలో మృతదేహాన్ని పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. చెరుకు తోటలో మృతదేహం దొరకడంతో సోదరులపై మర్డర్ కేసు పెట్టాడు. అయితే పోలీసుల దర్యాఫ్తులో అసలు విషయం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.  

Updated Date - 2021-07-03T17:21:04+05:30 IST