అదిరే వెదురు బ్యాట్‌ ఇతనిదే!

ABN , First Publish Date - 2021-05-30T23:16:43+05:30 IST

అదిరే వెదురు బ్యాట్‌ ఇతనిదే!

అదిరే వెదురు బ్యాట్‌ ఇతనిదే!

యుద్ధం చేసే సైనికునికి కత్తి ఎలాగో... బరిలో దిగే క్రికెటర్‌కు బ్యాటు అలాగ!. కాలంతో పాటు క్రికెట్‌ బ్యాటు రూపురేఖలు, తయారీ విధానం, వాడే కలప, కొలతలలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం క్రికెటర్లు అందరూ ఇంగ్లిష్‌ విల్లో చెట్టు కలపతో తయారుచేసిన బ్యాట్లనే ఎక్కువగా వాడుతున్నారు. దాంతో క్రమంగా ఆ చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అందుకు ప్రత్యామ్నాయంగా వెదురు బ్యాట్‌ను రూపొందించాడు దర్శిల్‌ షా. ఇప్పుడీ వెదురు బ్యాట్‌ను వాడాలా? వద్దా? అనే చర్చ నడుస్తోంది.. 


శతాబ్దాలుగా ఇంగ్లిష్‌ విల్లో చెట్టు నుంచే బ్యాట్లు తయారు చేస్తున్నారు. అది కూడా దృఢంగా ఉండే ఈ చెట్టు మధ్య భాగంలోని కలపతోనే బ్యాట్లను చేస్తారు. కశ్మీర్‌ విల్లో చెట్టుతో కూడా చేస్తారు కానీ ఇవి బరువు ఎక్కువ. అందుకని తేలికైన, ‘స్వీట్‌ స్పాట్‌’ అధికంగా ఉండే ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్లనే విరాట్‌ కోహ్లీతో సహా ప్రపంచ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లందరూ వాడుతున్నారు. సాధారణంగా 1100 నుంచి 1400 గ్రాముల బరువుండే ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్‌ ఖరీదు కూడా ఎక్కువే. కేవలం బ్యాట్ల తయారీ వల్లే ఇంగ్లిష్‌ విల్లో చెట్ల కలప కొరత అధికంగా ఉంది. భవిష్యత్‌లో ఇది మరింత తీవ్రం కానుంది. దాంతో ఇంగ్లండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి, క్రికెటర్‌ అయిన డాక్టర్‌ దర్శిల్‌ షా మదిలో రూపుదిద్దుకొన్న కొత్త ఆవిష్కరణ వెదురు బ్యాట్‌. ప్రపంచంలో పలు దేశాల్లో వెదురు విస్తారంగా లభిస్తుంది. ఆ దిశగా ఆలోచన చేసిన దర్శిల్‌ ఎంతో పరిశోధన చేసిన తర్వాత వెదురు బ్యాట్లను రూపొందించాడు. ప్రపంచ క్రికెట్‌ నియమ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఇప్పటికిప్పుడు ఈ వెదురు బ్యాట్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయినా నిరాశ చెందని దర్శిల్‌.. తన బ్యాటులో ఉన్న లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగైనదిగా రూపొందిస్తానంటున్నాడు. పర్యావరణ హితమేకాదు అందరికీ అందుబాటు ధరలో లభ్యం కానుండడం ఈ వెదురు బ్యాట్‌ ప్రత్యేకతని చెబుతున్నాడాయన.


ఎవరీ దర్శిల్‌..

33 ఏళ్ల దర్శిల్‌ షా లండన్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ మెటీరియల్‌ ఇన్నొవేషన్‌’లో సీనియర్‌ రీసెర్చర్‌. పవన విద్యుత్‌, నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ, రవాణా, వినియోగ ఉత్పత్తుల తయారీ తదితర రంగాలలో సంపద్రాయంగా భారీ మెటీరియల్‌ ఉపయోగిస్తుంటారు. వాటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మేలు చేయడంతోపాటు, తేలికగా ఉండే.. కలప, వెదురు, ఇతర సహజ ఫైబర్‌ మిశ్రమాలతో రూపొందించే మెటీరియల్‌ తయారీపై వివిధ రంగాల శాస్త్రవేత్తలతో కలిసి అతడు పరిశోధనలు చేస్తుంటాడు. దర్శిల్‌ తల్లిదండ్రులది అహ్మదాబాద్‌. అతడికి నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం బ్యాంకాక్‌ వెళ్లింది. పాలిస్టర్‌ ఫైబర్‌ తయారు చేసే సంస్థలో షా తండ్రి ఉద్యోగం చేసేవాడు. బ్యాంకాక్‌లో క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్న దర్శిల్‌.. 13 ఏళ్లకే థాయ్‌లాండ్‌ జూనియర్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఆ టీమ్‌ తరపున ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలలో ఆడాడు. 19 ఏళ్ల వయస్సులో నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ చేసేందుకు యూకే వెళ్లాడు. దాంతో దర్శిల్‌ క్రికెట్‌ కెరీర్‌కు బ్రేక్‌ పడింది. నాలుగేళ్ల విరామం అనంతరం తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మీడియం పేసర్‌ అయిన దర్శిల్‌ విల్లో చెట్ల్ల కొరత, దాంతో ఆ బ్యాట్లు రేటు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య క్రికెటర్లకు అందుబాటులో లేకపోవడం, పైగా అరుదైన విల్లో చెట్ల నరికివేతతో పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి ఆలోచించాడు. అతడికి మిత్రుడైన టింక్లెర్‌ డేవిస్‌ తోడయ్యాడు. అలా వారిద్దరూ కలిసి చేసిన పరిశోధన ఫలితమే వెదురు బ్యాట్‌ ఆవిర్భావం. వారి పరిశోఽధన వివరాలు ‘స్పోర్ట్స్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ బ్యాట్‌కు క్రికెటర్లు, ప్రజల నుంచి మంచి స్పందన రావడం దర్శిల్‌లో ఉత్సాహం నింపింది. తొలుత వెదురు బ్యాట్‌కు కావాల్సిన మెటీరియల్‌ను దర్శిల్‌, డేవిస్‌లే సమకూర్చున్నారు. అనంతరం లండన్‌లోని ఓ బ్యాట్ల తయారీ సంస్థ ద్వారా.. వెదురు బ్యాట్‌కు రూపు ఇచ్చారు. ఆ బ్యాట్‌ను తన క్లబ్‌ క్రికెటర్లకు చూపిస్తే వారంతా అది విల్లో బ్యాటనే భావించారు. కానీ అది వెదురుతో చేసిన బ్యాటని దర్శిల్‌ చెప్పగానే ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం అతడి వెదురు బ్యాట్‌ను జూనియర్‌ ఆటగాళ్లు  ఉపయోగిస్తున్నారు. అయితే షా ఎంతో శ్రమించి రూపకల్పన చేసిన వెదురు బ్యాట్‌కు ఎంసీసీ అనుమతి లభిస్తే... క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం. 

                                                                                                                        - వనం కళ్యాణ్‌

Updated Date - 2021-05-30T23:16:43+05:30 IST