19 ఏళ్ల యువతి అరుదైన ఫీట్.. బుల్లెట్‌ బండెక్కి కత్తులతో డుగ్గుడుగ్గుమంటూ విన్యాసాలు..!

ABN , First Publish Date - 2021-10-14T13:03:52+05:30 IST

దేవీ నవరాత్రులు ముగుస్తున్న తరుణంలో..

19 ఏళ్ల యువతి అరుదైన ఫీట్.. బుల్లెట్‌ బండెక్కి కత్తులతో డుగ్గుడుగ్గుమంటూ విన్యాసాలు..!

దేవీ నవరాత్రులు ముగుస్తున్న తరుణంలో ఆలయాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంటోంది. కరోనా కారణంగా ఉత్తరభారతదేశంలో ఈసారి భారీ స్థాయిలో గర్బా నృత్యాలను ఏర్పాటు చేయలేదు. అయితే దేవీ మండపాల వద్ద స్థానికులు చిన్నచిన్న గ్రూపులుగా ఏర్పడి, గర్బా నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో యూత్ క్లబ్ రాధాగంజ్ తరపున నిర్వహించిన గర్బా నృత్య ప్రదర్శనలో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ఆయుషీ చౌహాన్ చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఆమె బుల్లెట్ బండిపైకెక్కి కత్తులతో నృత్యవిన్యాసాలు చేసింది. ఇంతేకాదు స్టూల్ మీద నిలుచుని కూడా కత్తులతో విన్యాసాలు చేసింది. ఆయూషీ  నాలుగేళ్ల క్రితం ఇంటర్నెట్‌లో కత్తులతో విన్యాసాలను చేసేవారిని చూసి స్ఫూర్తిపొందింది. 


ఇంటర్నెట్‌లో వీడియోలను చూస్తూనే కత్తి విన్యాసాలు నేర్చుకుంది. తనకు తానుగానే ఈ విద్యలో నైపుణ్యం సంపాదించింది. రెండు చేతులతోనూ కత్తులను తిప్పడంలో అనుభవం సంపాదించింది. బీబీఏ చదువుతున్న ఆయుషీ భవిష్యత్‌లో ఎంబీఏ చేయాలని కోరుకుంటోంది. బ్యాంకు ఉద్యోగి అయిన ఆమె తండ్రి ముక్తానంద్ తన కుమార్తె అభిరుచులను గుర్తించి, ఆ దిశగా ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయుషీ మాట్లాడుతూ రాజపూత్ సమాజంలో మహిళలు కత్తివిన్యాసాలు నేర్చుకుని, వాటిలో నైపుణ్యం సంపాదిస్తారు. ఇలాంటి వారిని చూసి స్ఫూర్తి పొందాను. ఈ విద్యను మరికొంతమంది యువతులకు నేర్పాలనుకుంటున్నానని ఆయుషి తెలిపారు.

Updated Date - 2021-10-14T13:03:52+05:30 IST