జీవిత సారం అంటే ఇదే.. ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్

ABN , First Publish Date - 2022-01-01T00:57:32+05:30 IST

తాజాగా ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ మంచి స్ఫూర్తిదాయక ఫొటోను షేర్ చేశారు.

జీవిత సారం అంటే ఇదే.. ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. తనకు అందిన ఆసక్తికర వీడియోలు, చిత్రాలు, కథనాలను నెటిజన్లతో తరచూ పంచుకుంటూ ఉంటారు. వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా, సమాజంలో సమస్యలు హైలైట్ అయ్యేలా పలు వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అందుకే.. ఆయనకు సోషల్ మీడియాలో అంతటి క్రేజ్! తాజాగా ఆయన నెటిజన్లకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ మంచి స్ఫూర్తిదాయక ఫొటోను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది నాకు అన్నికంటే బాగా నచ్చిన ఫొటో ఇదే’’ అంటూ కామెంట్ చేశారు. ఖాళీగా ఉన్న తోపుడు బండిని ఓ వ్యక్తి తోసుకెళుతుండగా.. దానిపై కూర్చుని ఓ స్కూల్ విద్యార్థి వెళ్తుండగా తీసిన ఫొటో ఇది. ఆ ఫొటోలోని చిన్నారిని.. తన చుట్టూ వాహనాల హారన్ చప్పుళ్లూ, రణగొణధ్వనులు ఉన్నా కూడా ఏకాగ్రతతో తన హోం వర్క్ చేసుకుపోతుంటాడు. 


ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘‘ఆశావాదం, కష్టపడేతత్వం.. జీవిత సారం అంటే ఇదే. . మీ ఆశలన్నీ తీరేలా కొత్త సంవత్సరం ఉండాలని ఆశిస్తున్నా’’ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా చాలా కరెక్టుగా చెప్పారంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు ఆయనకు కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. Updated Date - 2022-01-01T00:57:32+05:30 IST