ఓ ఇంజినీరు ఘనత... సరికొత్తగా చీరల తయారీ...
ABN , First Publish Date - 2021-10-17T16:09:49+05:30 IST
పర్యావరణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ గౌరవ్ ఆనంద్ వాటర్

రాంచీ : పర్యావరణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ గౌరవ్ ఆనంద్ వాటర్ హయసింత్ నుంచి సేకరించిన ఫైబర్‌తో చీరలను తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు. చీరల తయారీకి దీనిని వాడటం ఇదే తొలిసారి అని, జనపనార మాదిరిగానే వాటర్ హయసింత్‌ను ఉపయోగించి, సేకరించిన ఫైబర్‌ను ప్రాసెస్ చేసి, దారాలుగా మార్చి, చీరలను తయారు చేయవచ్చునన్నారు.
గౌరవ్ ఆనంద్ జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ యుటిలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. వాటర్ హయసింత్ (సువాసనగల పూల చెట్లు) నుంచి ఫైబర్‌ను సేకరించడం చాలా సులువని గౌరవ్ చెప్పారు. మహిళలు కూడా ఈ పనిని తేలికగా చేయవచ్చునన్నారు. నదిలోని వాటర్ హయసింత్‌ను సేకరించి, దానిని ఎండబెట్టి, పలుచని ఫైబర్‌ను తీసి, ఏజెన్సీకి అమ్ముకోవచ్చునని చెప్పారు. ఆ ఏజెన్సీవారు ఆ ఫైబర్‌ను దారాల రూపంలోకి మార్చుతారని చెప్పారు. ఈ దారాలను స్థానిక చేతి వృత్తులవారికి ఇస్తే, వారు అత్యుత్తమ నాణ్యతగల చీరలను తయారు చేస్తారని చెప్పారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, నది కూడా శుభ్రపడుతుందన్నారు.
దీనికి సంబంధించిన ప్రయోగాలన్నీ జరుగుతున్నాయని, వివిధ ఏజెన్సీలతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. సుమారు ఐదు నుంచి ఏడు నెలల్లోగా హయసింత్ చీరలు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు.