కేకే శైలజను కాదని మరీ కేరళలో ఆరోగ్య శాఖకు కొత్త మంత్రి.. ఎవరీ వీణా జార్జ్..!

ABN , First Publish Date - 2021-05-21T22:51:50+05:30 IST

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికార పీఠం నిలబెట్టుకుంది.

కేకే శైలజను కాదని మరీ కేరళలో ఆరోగ్య శాఖకు కొత్త మంత్రి.. ఎవరీ వీణా జార్జ్..!

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికార పీఠం నిలబెట్టుకుంది. పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఎవరినీ రెండోసారి మంత్రిగా నియమించకూడదనే పార్టీ నిర్ణయం మేరకు అందరూ కొత్తవారినే క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. కరోనా కాలంలో సమర్థంగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను కూడా పక్కన పెట్టడం చాలా మందికి విస్మయం కలిగించింది. ఆమె స్థానంలో వీణా జార్జ్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 


ఎవరీ వీణా జార్జ్..!

మంత్రివర్గానికి కొత్త మొహమే అయినప్పటికీ వీణా జార్జ్ కూడా సాధారణ మహిళ కాదు. కేరళ జర్నలిజంలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హోదా పొందిన తొలి మహిళా జర్నలిస్టు వీణ. 1976 ఆగస్ట్ 3న తిరువనంతపురంలో జన్మించిన వీణ ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో స్టేట్ ర్యాంకర్‌గా నిలిచారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం టీవీ జర్నలిజంలోకి ప్రవేశించారు. కైరళి, మనోరమ, టీవీ న్యూస్ వంటి ప్రైమ్ ఛానళ్లలో నూస్ యాంకర్‌గా, న్యూస్ ఎడిటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పని చేశారు.


విద్యార్థి దశలోనే వీణ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే సీపీఐ (ఎమ్) విద్యార్థి విభాగం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ప‌ట్టణ‌మిట్ట జిల్లాలోని ఆర‌న్‌మూల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2016లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్ల అనంతరం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 


వ్యక్తిగత జీవితం!

అడ్వకేట్ పీఈ కురియాకోస్, రోశమ్మ కుమార్తె అయిన వీణ కేరళ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. హయ్యర్ సెకెండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ అయిన జార్జ్ జోసెఫ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2016లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆమె దాదాపు 16 సంవత్సరాల పాటు టీవీ జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పదోన్నతి పొంది కేరళలో ఆ బాధ్యత నిర్వర్తించిన తొలి మహిళా జర్నలిస్ట్‌గా నిలిచారు. శైలజకు నిరాశే..

కేర‌ళ‌లో క‌రోనా క‌ట్టడికి అవిశ్రాంతంగా ప‌ని చేసిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌కు కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి పెరుగుతోంది. ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సినీ ప్రముఖులు సైతం ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో శైలజ మట్టన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 61.97 శాతం ఓట్లతో గెలుపొందారు. అయినప్పటికీ వరుసగా రెండోసారి ఎవరినీ మంత్రిని చేయకూడదనే పార్టీ నిర్ణయం మేరకు ఆమెను పక్కన పెట్టక తప్పలేదు. సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం ఇదే భావాన్ని వ్యక్తం చేశారు.శైలజ సైతం పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు. సీపీఎంలో పదవుల కోసం పనిచేసేవారు లేరని, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటమే కార్యకర్తల పని అని చెప్పారు. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వటంలో సీపీఎం ఎప్పుడూ ముందు ఉంటుందని శైలజ స్పష్టం చేశారు. కాగా, యూకేకు చెందిన ఓ మ్యాగజైన్ శైలజను `టాప్ థింకర్ ఆఫ్ ద ఇయర్`గా కూడా ఎంపిక చేసి ప్రశంసించింది.Updated Date - 2021-05-21T22:51:50+05:30 IST