13 ఏళ్ల క్రితం బైడెన్‌ను రక్షించేందుకు మంచులో 30 గంటలు గడిపిన వ్యక్తి.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే..

ABN , First Publish Date - 2021-09-03T03:14:55+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోసం 30 గంటలపాటు మంచులో నిలబడ్డాడతను. బైడెన్ ఒక్కడే కాదు అమెరికా రాజకీయ నేతలు చక్ హాగెల్, జాన్ కెర్రీ వంటి వారిని రక్షించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు...

13 ఏళ్ల క్రితం బైడెన్‌ను రక్షించేందుకు మంచులో 30 గంటలు గడిపిన వ్యక్తి.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోసం 30 గంటలపాటు మంచులో నిలబడ్డాడతను. బైడెన్ ఒక్కడే కాదు అమెరికా రాజకీయ నేతలు చక్ హాగెల్, జాన్ కెర్రీ వంటి వారిని రక్షించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు క్షణక్షణం భయంతో, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నాడు. ఎందుకంటే అతనో అఫ్ఘాన్ వాసి. 2008లో అప్పట్లో సెనేటర్లుగా ఉన్న బైడెన్, చక్ హాగెల్, జాన్ కెర్రీలు హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మంచు తుఫాను కారణంగా వీటిని అఫ్ఘాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.


అప్పుడు ఈ బృందంలో అనువాదకుడిగా పనిచేసిన మహమ్మద్ అనే వ్యక్తి ప్రస్తుతం అఫ్ఘాన్‌ గడ్డపై భయంతో బతుకుతున్నాడు. తన పూర్తి పేరు చెబితే తాలిబన్లు ఎక్కడ గుర్తుపట్టి చంపేస్తారో? అనే భయంతో కేవలం మహమ్మద్ అని మాత్రమే చెప్తున్న అతను.. ‘‘హలో మిస్టర్ ప్రెసిడెంట్. నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. నన్ను ఇక్కడే మర్చిపోకండి’’ అని వేడుకుంటున్నాడు. తాజాగా ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మహమ్మద్.. తన వ్యధ వెళ్లబోసుకున్నాడు. అతని మాటలు శ్వేతసౌధానికి కూడా చేరినట్లున్నాయి. అతన్ని, అలా తమ ప్రభుత్వానికి సహాయం చేసిన వాళ్లందర్నీ తాము కాపాడుకుంటామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి హామీ ఇచ్చారు. ‘‘మిమ్మల్ని బయటకు తీసుకొస్తాం. మీ సేవను కచ్చితంగా గౌరవిస్తాం’’ అని ఆమె చెప్పారు. తమకు సహాయం చేసిన వాళ్ల సేవను తాము మర్చిపోవడం జరగదని స్పష్టం చేశారు. కాగా, ఇలా మహమ్మద్ వంటి వాళ్లు అమెరికాలో ప్రవేశించేందుక ఇమిగ్రెంట్ వీసా అవసరం. ఈ వీసా ప్రక్రియ ఆలస్యం అవడంతో మహమ్మద్ వంటి ఎందరో అఫ్ఘాన్ గడ్డపై ఇరుక్కుపోయినట్లు సమాచారం.


Updated Date - 2021-09-03T03:14:55+05:30 IST