‘చనిపోయిన’ వ్యక్తి మార్చురీ ఫ్రీజర్‌లో... 7 గంటల తర్వాత ప్రాణాలతో ప్రత్యక్షం...
ABN , First Publish Date - 2021-11-21T19:11:51+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌వాసి శ్రీకేష్ కుమార్

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌వాసి శ్రీకేష్ కుమార్ మృత్యుంజయుడిగా నిలిచారు. ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించిన తర్వాత ఆయన మృతదేహాన్ని మార్చురీ ఫ్రీజర్‌లో పెట్టారు. 7 గంటల తర్వాత ఆయన ప్రాణాలతో సజీవంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆయనను మీరట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు.
మొరాదాబాద్ పురపాలక సంఘంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న శ్రీకేష్ కుమార్ వాహన ప్రమాదానికి గురయ్యారు. గురువారం ఆయనను ఓ బైక్ ఢీకొట్టడంతో, జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆయనను పరీక్షించి, ఆయన మరణించినట్లు తెలిపారు. ఆ మర్నాడు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో పెట్టారు.
శవ పరీక్షకు అంగీకరిస్తూ కుటుంబ సభ్యులు పంచనామాపై సంతకాలు చేసే సమయంలో శ్రీకేష్ మరదలు ఆయన మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన కదులుతున్నట్లు గుర్తించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని చెప్పారు. వారంతా మృతదేహాన్ని పరిశీలించి, ఆయన కదులుతున్నట్లు గమనించారు వెంటనే పోలీసులకు, వైద్యులకు సమాచారం అందించారు.
శ్రీకేష్‌ను ఫ్రీజర్ నుంచి బయటకు తీసి, మీరట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.