పాపం.. చనిపోతున్నట్టు నటిద్దామనుకున్నాడు.. స్నేహితులను పిలిచి వీడియో తీయమన్నాడు... కానీ..
ABN , First Publish Date - 2021-12-15T17:41:10+05:30 IST
సోషల్ మీడియా పిచ్చి ఎంతో మందిని ప్రమాదాల్లోకి నెట్టేస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో

సోషల్ మీడియా పిచ్చి ఎంతో మందిని ప్రమాదాల్లోకి నెట్టేస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలు, వీడియోలు పోస్ట్ చేసేందుకు చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ బాలుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసేందుకు ఓ వీడియో తీయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇండోర్‌లో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసేందుకు ఆత్మహత్య వీడియోను చిత్రీకరిద్దామనుకున్నాడు.
సూసైడ్ చేసుకుంటున్నట్టు నటిస్తూ వీడియోను చిత్రీకరించి దానిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలనుకున్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని సోమవారం సాయంత్రం తన స్నేహితులను పిలిచాడు. స్నేహితుల ఎదురుగానే సీలింగ్‌కు వేలాడుతున్న తాడును మెడకు తగిలించుకున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ స్టూల్ నుంచి జారిపోయాడు. దీంతో తాడు మెడకు బిగుసుకుంది. ఆ ఘటనను చూడడానికి వచ్చిన స్నేహితులు భయపడి బయటకు పారిపోయారు.
కొద్దిసేపటికి ఆ బాలుడి తమ్ముడు ఇంటికి వచ్చి ఉరికి వేలాడుతున్న అన్నయ్యను చూసి భయపడ్డాడు. చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారు వచ్చి బాలుడిని దించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆ బాలుడు మరణించాడు. `అతను ఎప్పటికప్పుడు వెరైటీ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. సోషల్ మీడియా కోసమే సూసైడ్ చేసుకుంటున్నట్టు నటిద్దామనుకున్నాడు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల వివాహం కోసం బాలుడి తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లడంతో ఘోరం జరిగింద`ని ఎస్ఐ కిశోర్ చెప్పారు.