వంకాయల దొంగ ఎవరు?

ABN , First Publish Date - 2021-09-19T05:30:00+05:30 IST

శ్రీకృష్ణదేవరాయల వారి రాయల్‌ గార్డెన్‌లో అరుదైన వంకాయలు పండేవి.

వంకాయల దొంగ ఎవరు?

శ్రీకృష్ణదేవరాయల వారి రాయల్‌ గార్డెన్‌లో అరుదైన వంకాయలు పండేవి. అవి చాలా రుచికరంగా ఉంటాయని, అలాంటి వంకాయలు మరెక్కడా దొరకవని, రాయల్‌ గార్డెన్‌లో మాత్రమే దొరుకుతాయని ప్రజలు అనుకునేవారు. అందుకే ఇరవై నాలుగు గంటలు ఆ తోటకు భటులు కాపలాగా ఉండేవారు. ఒకరోజు రాజు సభికులందరినీ విందుకు ఆహ్వానించాడు. ప్రత్యేకంగా వంకాయ కూరను వడ్డించాడు. తెనాలి రామకృష్ణకూడా అ విందులో వంకాయ కూర రుచి చూశాడు. ఆ కూర రుచి తనకెంతగానో నచ్చింది. ఇంటికి వెళ్లగానే భార్యకు ఆ విషయం చెప్పాడు. రామకృష్ణ ఆ కూర గురించి గొప్పగా చెప్పడంతో ఆవిడకు కూడా తినాలని అనిపించింది. ‘ఎలాగైనా సరే ఆ వంకాయలు తీసుకురండి, నేను కూర వండుతాను’ అని అడిగింది. ‘అవి రాయల్‌ గార్డెన్‌లో మాత్రమే దొరుకుతాయి. 


అక్కడి నుంచి నేనెలా తీసుకురాగలను. సాధ్యం కాదు’’ అని సమాధానం ఇచ్చాడు. అయితే భార్య పదేపదే అడగడంతో సరేనని ఒప్పుకున్నాడు. ఒకరోజు రాత్రి రాయల్‌గార్డెన్‌లో నుంచి వంకాయలు తెంపి తీసుకొచ్చాడు. వాటితో భార్య రుచికరంగా వండింది. తెనాలి రామకృష్ణకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అతనికి పెట్టకుండా తినేందుకు ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. కానీ అతడు పొద్దున వంకాయ కూర తిన్న విషయం ఎవరికైనా చెబితే సమస్య వస్తుంది అనుకుని మిన్నకుండిపోయింది. తల్లిమనసును రామకృష్ణ గ్రహించాడు. ఇంతలో కొడుకు హోంవర్క్‌ పూర్తి చేసి డాబాపైకెళ్లి పడుకున్నాడు. ఆ వెంటనే రామకృష్ణకు ఆలోచన తట్టింది. డాబాపైకెళ్లి ఒక బకెట్‌ నీళ్లు నిద్రపోతున్న కొడుకుపై పోశాడు. నిద్రలేచిన కొడుకును పట్టుకుని ‘‘వర్షం పడుతోంది. ఇంట్లోకి వెళదాం పద!’’ అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లో బట్టలు మార్చి, వంకాయ కూరతో భోజనం తినిపించాడు. అదే సమయంలో భార్యతో ‘‘బయట వర్షం పడుతోంది. ఈ రోజు ఇంట్లోనే పడుకోండి’’ అని గట్టిగా అన్నాడు.మరుసటి రోజు తోటలో వంకాయలు మాయమైన విషయాన్ని భటులు గ్రహించారు. విషయాన్ని రాజుకు తెలియజేశారు. దాంతో రాజు కోపంగా ‘దొంగతనం చేసిన వారిని వెంటనే పట్టుకోండి’ అని ఆజ్ఞాపించాడు. 


అప్పుడు ప్రధాన సలహాదారైన అప్పాజీ తెనాలి రామకృష్ణ మాత్రమే ఇది చేయగలడు అని రాజుతో అన్నాడు. అయితే వెంటనే రామకృష్ణను సభకు తీసుకురండి అన్నాడు. తెనాలి రామకృష్ణ రాగానే వంకాయల గురించి అడిగాడు. ‘‘నాకు తెలియదు మహారాజా!’’ అని ఏమీ తెలియని వాడిలా సమాధానం ఇచ్చాడు రామకృష్ణ. అయితే రామకృష్ణ కొడుకును పిలిచి అడగండి మహారాజా అని అప్పాజీ మరో సలహా ఇచ్చాడు. వెంటనే భటులు రామకృష్ణ కొడుకును పట్టుకొచ్చారు. ‘‘రాత్రి భోజనంలో ఏం తిన్నారు’’ అని ఆ బాలున్ని అప్పాజీ అడిగాడు. ‘‘వంకాయ కూర తిన్నాను. చాలా రుచిగా ఉంది’’ అన్నాడు. వెంటనే అప్పాజీ ‘‘రామకృష్ణా! నీ తప్పు ఒప్పుకో’’ అన్నాడు. అప్పుడు రామకృష్ణ ‘‘లేదు అప్పాజీ! నా కొడుకు త్వరగా నిద్రపోయాడు. వాడు ఏదో కల కన్నట్టు ఉన్నాడు’’ అని అన్నాడు. దాంతో స్కూల్‌ నుంచి తిరిగొచ్చాక ఏమేం చేశావో అన్నీ వివరంగా చెప్పు అని బాబుని మళ్లీ అడిగాడు అప్పాజీ. ‘‘స్కూల్‌ నుంచి రాగానే కాసేపు ఆడుకున్నాను. తరువాత హోంవర్క్‌ పూర్తి చేశాను. డాబాపైకెళ్లి పడుకున్నాను. అప్పుడు మా నాన్న నిద్రలేపి వర్షం వస్తోందని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన తరువాత బట్టలు మార్చుకుని భోజనం చేసి నిద్రపోయాను’’ అని చెప్పాడు. ఆ సమాధానం విన్న అప్పాజీ ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి ఎక్కడా వర్షం పడలేదు. అంటే బాబు వంకాయ కూర తిన్నట్టుగా కల కన్నాడు అని మనసులో అనుకుని పంపించేశారు. మరుసటి రోజు మహారాజు, అప్పాజీ ఇద్దరే ఉన్న సమయంలో తెనాలి రామకృష్ణ వెళ్లి తన తప్పు ఒప్పుకుని క్షమించమని కోరాడు. మహారాజు క్షమించడమే కాకుండా తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకున్నాడు.

Updated Date - 2021-09-19T05:30:00+05:30 IST