రోప్ వాక్ ఆ గ్రామస్తుల హాబీ!
ABN , First Publish Date - 2021-10-20T07:09:11+05:30 IST
సర్క్సలో తాడుపై నడిచే వాళ్లను చూసుంటారు.

సర్క్సలో తాడుపై నడిచే వాళ్లను చూసుంటారు. ఆ విద్య తెలిసిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కానీ రష్యాలోని డాజెస్తాన్ రిపబ్లిక్లో ఉన్న స్వోక్రా -1 అనే చిన్న గ్రామానికి వెళితే మాత్రం అందరూ రోప్ వాక్ చేసే వాళ్లే కనిపిస్తారు. ఆ గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఆ విద్య తెలుసు.
ఒకప్పుడు ఈ గ్రామంలో 3 వేల వరకు జనాభా ఉండేది. ఇప్పుడు నాలుగు వందల మంది మాత్రమే ఉంటున్నారు. రోప్ వాకింగ్ నేర్చుకున్న చాలా మంది సర్క్సలలో పనిచేయడానికి వెళ్లిపోయారు. ఉన్న కొద్ది మంది ఇతరులకు శిక్షణనిస్తూ అక్కడే ఉన్నారు.
ఈ గ్రామం కొండల మధ్య ఉంటుంది. సరైన రహదారి లేదు. వంతెనలు కొట్టుకుపోయినప్పుడు, కొండల మధ్య దగ్గర దారిలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు రోప్ వాకింగ్ ఉపయోగపడుతుందని చాలామంది నేర్చుకున్నారు. ఇంకొంతమంది వ్యవసాయం గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో డబ్బు సంపాదించుకోవడానికి ఈ విద్య నేర్చుకున్నారు. అలా రోప్ వాకింగ్ నేర్చుకోవడం సంప్రదాయంగా మారింది. ప్రస్తుతం యువత కూడా ఆ గ్రామ సంప్రదాయాన్ని హాబీగా కొనసాగిస్తున్నారు. పట్టణాల్లో స్థిరపడినా ప్రతి ఒక్కరూ రోప్ వాక్ చేయడం మాత్రం కచ్చితంగా నేర్చుకుంటారు.