చేతులు లేకపోయినా ప్రొఫెషనల్ డ్రైవర్‌గా..!
ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST
ఓ ప్రమాదంలో అతడి రెండు చేతులు పోయాయి. అయితేనేం తనకిష్టమైన రేసింగ్‌ను మాత్రం వదల్లేదు. పట్టుదలతో కార్ల రేసింగ్‌లో..

ఓ ప్రమాదంలో అతడి రెండు చేతులు పోయాయి. అయితేనేం తనకిష్టమైన రేసింగ్‌ను మాత్రం వదల్లేదు. పట్టుదలతో కార్ల రేసింగ్‌లో పాల్గొని ప్రపంచంలోనే కాళ్లతో కారును నడిపే మొదటి ప్రొఫెషనల్ స్పోర్ట్ డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. పోలండ్‌కు చెందిన బార్టెక్ స్ఫూర్తి ప్రయాణం ఇది.
బార్టెక్ 2007లో జరిగిన ఓ మోటర్‌సైకిల్ యాక్సిడెంట్లో రెండు చేతులు కోల్పోయాడు. మంచి రేసర్‌గా పేరు సంపాదించాలన్నది అతడి కల. కానీ ఆ ప్రమాదం అతని కలలను చిద్రం చేయాలని చూసింది. బార్టెక్ మాత్రం కుంగిపోలేదు. రెండు చేతులు కోల్పోయినా తన ప్రయత్నం ఆపలేదు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కారుని నడిపి ఇంటర్నేషనల్ రేసింగ్ లైసెన్స్ పొందాడు. పోలండ్‌లో జరిగిన యూరోపియప్ చాంపియన్‌షిప్ ఆఫ్ ర్యాలీ క్రాస్ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో జరిగిన పోలిష్ డ్రిఫ్ట్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని 9వ స్థానంలో నిలిచాడు. ఇందులో 50 మంది పాల్గొన్నారు. ‘‘ప్రమాదం తరువాత పరిష్కారం కోసం ఆలోచించాను. ఒకవేళ నేను మళ్లీ రేసులో పాల్గొనాలంటే ఏం కావాలో ఆలోచించాను. పోలండ్‌లో ఒక వ్యక్తి చేతులు లేకపోయినా కారును నడపడం గురించి విన్నాను. అతణ్ణి కలిసిన తరువాత నా కల నెరవేర్చుకోవచ్చని అనిపించింది’’ అని తన జ్ఞాపకాలను పంచుకుంటాడు బార్టెక్. స్పోర్ట్ డ్రైవర్‌గా అవయవాలు కోల్పోయిన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు బార్టెక్.