ఒకే వేటులో చంపేయండి!

ABN , First Publish Date - 2021-08-21T07:56:49+05:30 IST

విజయనగర రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికీ

ఒకే వేటులో చంపేయండి!

విజయనగర రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కానీ తెనాలి రామకృష్ణ మాత్రం రాజు మాటలతో చాలాసార్లు ఏకీభవించేవాడు కాదు. దాంతో రాజు కోపంతో శిక్షించే వాడు. ఒకసారి అలాంటి సంఘటన జరిగింది. అయితే తెనాలి రామకృష్ణ  తెలివిగా శిక్ష నుంచి బయటపడ్డాడు. ఏం జరిగిందంటే... ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు, తెనాలి రామకృష్ణకు అభిప్రాయ భేదాలొచ్చాయి. దాంతో రాజు ఆగ్రహంతో ఒకే కత్తివేటుతో రామకృష్ణ తల నరికేయండి అని భటులను ఆదేశించాడు. రాజు ఆదేశాలను అమలు చేయడానికి భటులు తెనాలి రామకృష్ణను నది ఒడ్డుకు తీసుకెళ్లారు.


భటులిద్దరూ ‘‘నువ్వు చంపు అంటే నువ్వు చంపు’’ అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. అది విన్న రామకృష్ణ ‘‘మీరు ఇద్దరూ ఒకేసారి కలిసి ఎందుకు చంపకూడదు?’’ అన్నాడు. అందుకు భటులు సరేనన్నారు. రామకృష్ణ నదిలో మోకాలి లోతు నీటిలో నిలుచున్నాడు. భటులు కత్తి ఎత్తగానే ‘‘ఆగండి. నా చివరి కోరికను తీర్చరా!’’ అని అడిగాడు. ‘‘ఏంటో చెప్పు, తీరుస్తాం’’ అన్నారు భటులు. ‘‘నేను జై మా కాళీ అని అనగానే మీరు కత్తితో నరకండి’’ అన్నాడు తెనాలి రామకృష్ణ. అందుకు సరే అన్నారు భటులు. రామకృష్ణ గట్టిగా శ్వాస పీల్చి ‘‘జై మా కాళీ’’ అన్నాడు. వెంటనే భటులు కత్తి దూశారు. అంతే వేగంగా రామకృష్ణ నీటిలో కూర్చున్నాడు. దాంతో భటుల కత్తులు రెండు ఒకదానికొకటి తగిలాయి.


వెంటనే మరోసారి కత్తి దూసేందుకు భటులు సిద్ధం కాగా ‘‘రాజు ఆదేశాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒకేవేటులో మీరు చంపలేకపోయారు. ఇంకోసారి ప్రయత్నించడం సరైన పద్దతి కాదు’’ అన్నాడు రామకృష్ణ. దాంతో భటులు డైలమాలో పడ్డారు. అదే సమయంలో రాజభవనం నుంచి కొందరు భటులు శిక్షను ఆపమని వర్తమానం తెచ్చారు. భటులు రామకృష్ణను తీసుకుని రాజప్రాసాదానికి చేరుకోగానే శ్రీకృష్ణదేవరాయలు ఆలింగనం చేసుకుని కోపంలో తీసుకున్న నిర్ణయానికి క్షమాపణలు కోరాడు.


Updated Date - 2021-08-21T07:56:49+05:30 IST