గాడిదతో ప్రయాణం!

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

ఒకరోజు నసురుద్దీన్‌ తన కొడుకుతో కలిసి పొరుగూరికి వెళుతున్నాడు. తన కొడుకును గాడిదపై కూర్చోపెట్టి, తను నడవసాగాడు.....

గాడిదతో ప్రయాణం!

ఒకరోజు నసురుద్దీన్‌ తన కొడుకుతో కలిసి పొరుగూరికి వెళుతున్నాడు.  తన కొడుకును గాడిదపై కూర్చోపెట్టి, తను నడవసాగాడు. దారిలో ఒకచోట కొందరు వీరిని చూసి ‘‘ఆ కుర్రాడేమో ఎంచక్కా గాడిదపై కూర్చున్నాడు. ముసలి తండ్రేమో నడుస్తున్నాడు. ఆ కొడుకు ఎంతటి కఠినాత్ముడు’’ అని అన్నారు. ఆ మాటలు విన్న నసురుద్దీన్‌ కొడుకు ఇబ్బందిపడ్డాడు. వెంటనే గాడిదపై నుంచి దిగి తండ్రిని కూర్చొమ్మని చెప్పి, తాను నడవడం ప్రారంభించాడు. ఇంకాస్త ముందుకు వెళ్లాక మరికొంతమంది ‘‘ఆ దృశ్యం చూడండి. ఆ తండ్రి ఎంత కఠినాత్ముడు. కొడుకును నడిపిస్తూ తాను మాత్రం హాయిగా కూర్చున్నాడు’’ అని అనడం చెవిన పడింది. ఆ మాటలు విన్న నసురుద్దీన్‌కు బాధగా అనిపించింది. దాంతో కొడుకును కూడా గాడిదపై కూర్చొబెట్టుకున్నాడు. ఇద్దరూ కూర్చుని ప్రయాణం చేయసాగారు. కొద్ది దూరం వెళ్లాక మరికొంతమంది వీరిని చూసి ‘‘ఆ తండ్రీ కొడుకులు ఎంత కఠినాత్ములో చూడండి. పాపం గాడిదను ఎంత కష్టపెడుతున్నారు. వాళ్లను జైల్లో పెట్టాలి’’ అనడం ఆ తండ్రీ కొడుకుల చెవున పడింది. దాంతో వాళ్లిద్దరూ గాడిదపై నుంచి దిగి నడవడం ప్రారంభించారు. ఇంకాస్త ముందుకు వెళ్లాక మరికొంతమంది వీరిని చూసి నవ్వుతూ ‘‘ఆ ఫూల్స్‌ని చూడు. ఇంత ఎండలో గాడిదపై కూర్చుని వెళ్లకుండా నడుచుకుంటూ వెళుతున్నారు. మూర్ఖులు కాకపోతే ఏంటి?’’ అని అన్నారు. ఆ మాటలు విన్న తండ్రీకొడుకులు పనీపాటలేకుండా కూర్చుని, రోడ్డున పోయే వారిపైన కామెంట్లు చేసే వారి పట్టించుకోకూడదని నిర్ణయించుకుని ముందుకు సాగిపోయారు.

Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST