కోకిల గర్వభంగం!

ABN , First Publish Date - 2021-01-21T05:27:09+05:30 IST

ఒక అడవిలో చెట్టుపై కోకిల, కాకి నివసించేవి. కోకిల ఎప్పుడూ కాకిని చిన్న చూపు చూసేది. సూటి పోటి మాటలతో బాధపెట్టేది.

కోకిల గర్వభంగం!

ఒక అడవిలో చెట్టుపై కోకిల, కాకి నివసించేవి. కోకిల ఎప్పుడూ కాకిని చిన్న చూపు చూసేది. సూటి పోటి మాటలతో బాధపెట్టేది. ఒకరోజు కోకిల ‘‘నేను కూస్తే అందరూ మెచ్చుకుంటారు. నీ కూత ఎవరికీ నచ్చదు. పైగా కాకిలా అరవకు అని దెప్పిపొడుస్తారు. నువ్వు నాకు ఎప్పటికీ సమానం కాలేవు’’ అని హేళన చేసింది. అందుకు బదులుగా కాకి ‘‘దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చాడు. నాక్కూడా కొన్నింటిలో స్థానం ఇచ్చాడు. కానీ నేను గొప్పలు చెప్పుకోను’’ అంది. ఇలా రోజూ వాటిమధ్య వాగ్వాదం నడిచేది. ఒకరోజు ప్రమాదవశాత్తు కాకి కాలుకు గాయం అయింది. ఆహారం కోసం బయటకు వెళ్లకుండా చెట్టుపైనే ఉండిపోయింది. కోకిల ఆహారం తెచ్చుకుని తినేసింది. కాకికి కొంచెం కూడా పెట్టలేదు. కొన్ని రోజుల తరువాత అడవి ఎండిపోయింది. ఆహారం దొరకడం కష్టపోయింది.


ఆహారాన్ని వెతుక్కుంటూ కాకి దగ్గరలో ఉన్న ఊరికి చేరుకుంది. కోకిల సైతం కాకితో పాటు అదే ఊరికి చేరుకుంది. అదే రోజు పెద్దలకు పిండం పెట్టడానికి కొంత మంది అన్నం తెచ్చి పెట్టి కాకి కోసం ఎదురు చూడసాగారు. ఆ ఆహారాన్ని గమనించిన కోకిల తినడం కోసం వాలబోయింది. వెంటనే వాళ్లు కోకిల తినకుండా తోలేసారు. తరువాత కాకి వాలింది. కాకి ఆహారం ముట్టగానే అందరూ వెళ్లిపోయారు. ఆ తరువాత కోకిలను పిలిచి సగభాగం ఇచ్చి తినమంది. ‘‘చూశావా మిత్రమా... నన్ను వారు పితృదేవతగా భావించి ఆహారం పెట్టారు. ఈ భాగ్యం ఏ పక్షికైనా ఉందా? దేని విలువ దానికి ఉంది’’ అని అనగానే కోకిలకు జ్ఞానోదయం అయింది. తన తప్పు తెలుసుకుంది. 

పంపినవారు: ఎన్‌. రాజారెడ్డి, అనంతపురం

Updated Date - 2021-01-21T05:27:09+05:30 IST