పాలిచ్చే తల్లులు బరువు తగ్గాలంటే..?
ABN , First Publish Date - 2021-05-21T20:06:44+05:30 IST
ఈ మధ్యనే ప్రసవించారు కాబట్టి, ఒకవేళ మీరు బిడ్డకు తల్లి పాలు పడుతున్నట్టయితే వేగంగా బ

ఆంధ్రజ్యోతి (21-05-2021)
ప్రశ్న: నాకు ఈమధ్యనే సి-సెక్షన్ డెలివరీ అయ్యింది. బీపీ కూడా ఉంది. బరువు తగ్గడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
-హారిక, కరీంనగర్
డాక్టర్ సమాధానం: ఈ మధ్యనే ప్రసవించారు కాబట్టి, ఒకవేళ మీరు బిడ్డకు తల్లి పాలు పడుతున్నట్టయితే వేగంగా బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు చేయడం వల్ల పాలు సరిగా పడకపోయే అవకాశం ఉంది. పాలు ఇస్తున్నప్పుడు తల్లిగా మీరు కూడా తగిన మోతాదుల్లో పోషకాహారం తీసుకోవాలి. బిడ్డకు పాలు ఇచ్చే మొదటి ఆరు నెలలు మీ ఆహారంలో కనీసం అరవై నుండి డెబ్బై గ్రాముల మాంసకృత్తులు ఉండాలి. దీనికోసం మీరు పాలు, పెరుగు, గుడ్లు, పప్పు ధాన్యాలు, పుట్టగొడుగులు, మాంసాహారం తినేవారైతే వారంలో రెండు సార్లు వంద గ్రాముల చికెన్ లేదా చేపలు తీసుకుంటే సరిపోతుంది. పోషకాలున్న ఆహారంతో పాటు రోజుకు కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. మీరు బరువు తగ్గడానికి ఆహారాన్ని మరీ తక్కువగా తీసుకుంటే, బిడ్డకు పాలు తక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువగా కాకుండా రోజులో మీకు అవసరమయ్యే కెలోరీల కంటే రెండు, మూడు వందల గ్రాములు తక్కువగా తీసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గుతారు, బిడ్డకు పాలకు కూడా ఇబ్బంది ఉండదు. బిడ్డకు ఘనాహారం మొదలు పెట్టిన తరువాత మీరు మరికొన్ని కెలోరీలు తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించి తీసుకోవడం వల్ల అలసట రాకుండా ఉండాలంటే ఆహారం సమయానికి తీసుకోవడం అవసరం. అలాగే పళ్ళు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు లాంటివి కావలసిన ఖనిజ లవణాలను అందిస్తాయి. ఆహార జాగ్రత్తలతో పాటు రోజుకు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు ఏదైనా వ్యాయామం చేసి బరువు తగ్గవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)