అబార్షన్‌... ఆచితూచి...

ABN , First Publish Date - 2021-01-12T18:01:14+05:30 IST

రాహుల్‌, వసంతలకు ఇంకా సంతానం లేదు. ఈమధ్యే వసంత గర్భం దాల్చింది. కొవిడ్‌ రోజు రోజుకు పెరిగిపోతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బిడ్డకు ఎక్కడ కరోనా

అబార్షన్‌... ఆచితూచి...

ఆంధ్రజ్యోతి(12-01-2020)

రాహుల్‌, వసంతలకు ఇంకా సంతానం లేదు. ఈమధ్యే వసంత గర్భం దాల్చింది.  కొవిడ్‌ రోజు రోజుకు పెరిగిపోతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బిడ్డకు ఎక్కడ కరోనా సోకుతుందేమోనని  ఈ దంపతులకు ఒకటే టెన్షన్‌. ఈ టెన్షన్‌ను తట్టుకోలేక అబార్షన్‌ చేయించుకుందామంటే దానివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియని పరిస్థితి.  వ్యాక్సీన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత  గర్భం దాల్చితే ఏ సమస్య ఉండదేమో అనే ఆలోచనలు రాహుల్‌, వసంతలను వేధిస్తున్నాయి..


మన చుట్టూ తరచి చూస్తే రాహుల్‌, వసంతలాంటి వాళ్లెందరో మనకు కనిపిస్తారు. గతంతో పోల్చి చూస్తే కొవిడ్‌ వ్యాపించటం మొదలుపెట్టిన తర్వాత అబార్షన్లు బాగా పెరిగాయంటున్నారు మెడికవర్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రభా అగర్వాల్‌. 


దంపతులు అబార్షన్‌ అనే ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడు ఆశ్రయించాలి? అబార్షన్‌ చేయించుకుంటే కలిగే దుష్పరిణామాలేమిటి అనే విషయాన్ని ఆమె వివరించారు. కొవిడ్‌ మనందరి జీవితాల్లో అనేక మార్పులు తీసుకువచ్చింది. దంపతులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏకాంత సమయం కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గర్భనిరోధక సాధనాల కొరత కూడా ఉంది. ఇలాంటి కారణాల వల్ల అవాంఛిత గర్భధారణ కూడా బాగా పెరిగింది. ఇలా అనుకోకుండా గర్భం ధరించినప్పుడు- అబార్షన్‌ చేయించుకోవాలా? లేదా అనేది ప్రధానమైన సమస్య. వాస్తవానికి గర్భవిచ్ఛిత్తి అంత సులభమైన అంశం కాదు. అనుభవం లేని వైద్యులను ఆశ్రయిస్తే అబార్షన్‌ తర్వాత తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశముంటుంది. గర్భం ధరించిన తర్వాత మహిళల్లో హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి.


ఈ హెచ్చుతగ్గులే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో గర్భవిచ్ఛిత్తి జరిగితే- హార్మోన్లు ముందస్తు స్థితికి చేరుకోవటానికి కొంత సమయం పడుతుంది. రక్తస్రావం జరుగుతుంది. నెలసరి క్రమం తప్పుతుంది. కొందరిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. వీటితో పాటు తెల్లబట్ట, నడుమునొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో ఫెలోపియన్‌ ట్యూబులు మూసుకుపోతాయి. అబార్షన్‌ సమయంలో గర్భసంచీని సరిగ్గా శుభ్రం చేయకపోతే- గర్భసంచీ దెబ్బతిని అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించాకే అబార్షన్‌  చేయించుకోవటం మంచిది. 


ఎప్పుడు చేయించుకోవాలి?

గర్భం దాల్చిన 20 వారాల తరువాత అబార్షన్‌ చేయించుకోవటం చట్టరీత్యా నేరం. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యుల అనుమతితో అబార్షన్‌ చేయించుకోవచ్చు. ఉదాహరణకు గర్భిణికి మూత్రపిండాలు లేదా గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు, స్కానింగ్‌లో బిడ్డకు జన్యుపరమైన సమస్యలు ఉన్నాయని తేలినప్పుడు.. గర్భస్థ శిశివు గుండె, మూత్రపిండాలు, మెదడు సక్రమంగా ఎదగలేదని తేలినప్పుడు అబార్షన్‌ చేయించుకోవచ్చు. కొవిడ్‌ వ్యాప్తి మొదలయ్యాక చాలామందిలో గర్భస్థ శిశువుకు కూడా కొవిడ్‌ సోకుతుందనే భయం పెరిగింది. వాస్తవానికి ఇప్పటి దాకా జరిగిన పరిశోధనల్లో తల్లి ద్వారా గర్భస్థ శిశువులకు కొవిడ్‌ సోకుతుందని తేలలేదు. అందువల్ల గర్భం ధరించిన తర్వాత కొవిడ్‌ వచ్చినా బిడ్డకు ఆ వైరస్‌ సోకే అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే కొవిడ్‌ భయంతో అబార్షన్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవదు.


వైద్యపరమైన కారణాలతో...

కొన్ని తప్పనిసరి సందర్భాల్లో  వైద్యులు అబార్షన్‌ను సూచిస్తూ ఉంటారు. అవేమిటంటే...


గర్భిణికి మూత్రపిండాలు లేదా గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు 


12వ వారంలో చేసే స్కాన్‌లో గర్భస్థ శిశువుకు ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’ ఉందని తేలినప్పుడు


బిడ్డ గుండె, మూత్రపిండాలు, మెదడు సక్రమంగా ఎదగలేదని గుర్తించినప్పుడు


(కొవిడ్‌ వ్యాక్సీన్‌ను ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే వీలు లేదు. కాబట్టి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద కొవిడ్‌ ప్రభావం గురించి ఆందోళ పడేవారు, వ్యాక్సీన్‌ వేయించుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం మేలు)ఆలస్యం - అమృతం - విషం

గర్భసంచీ ఉన్నది గర్భస్రావం కోసం కాదు. తొమ్మిది నెలలు పదిలంగా బిడ్డను మోసి, ప్రసవంతో కొత్త జన్మను అందించేందుకు ఉద్దేశించినది. అలాంటప్పుడు గర్భం దాల్చే వీలుందని తెలిసీ అసురక్షిత శృంగారంలో పాల్గొనడం దంపతులు చేసే మొదటి తప్పు. ఒకవేళ ఆ క్రమంలో గర్భం దాల్చితే, గర్భాన్ని కొనసాగించడమే మహిళ ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలా వీలు కానప్పుడు ఆలస్యం చేస్తే అది రెండో తప్పు అవుతుంది. గర్భం వద్దనుకుంటే అబార్షన్‌ నిర్ణయం సాధ్యమైనంత త్వరగా అమలులో పెట్టాలి. గర్భంలో బిడ్డ వయసు పెరిగేకొద్దీ బిడ్డకూ, తల్లికీ మానసిక బంధం బలపడుతుంది. కాబట్టి అబార్షన్‌ చేయించుకోవలనే నిర్ణయం ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిది. ఐదు నుంచి ఆరు వారాల వయసున్న గర్భంలోని పిండానికి హార్ట్‌బీట్‌ ఉండదు. కాబట్టి అబార్షన్‌ చేయించుకున్నా బిడ్డను పోగొట్టుకున్నాననే మానసిక వేదన అనుభవించే అవకాశం తక్కువ. అలా కాకుండా మూడు నెలలు దాటే వరకూ ఆగితే, బిడ్డ శరీరంలో ఎముకలు కూడా ఏర్పడతాయి. అప్పుడు గర్భస్రావం క్లిష్టంగా మారుతుంది. అదే సమయంలో అప్పటికే కడుపులో పెరిగే బిడ్డతో తల్లికి ఏర్పడిన అనుబంధం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది.  లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా వైరస్‌ పాండమిక్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్దీ మహిళలు గర్భనిరోధక సాధనాలు, అబార్షన్‌ సేవల కొరతను ఎదుర్కొన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల అవాంఛిత గర్భాలు, ఒకటిన్నర లక్షల అరక్షిత అబార్షన్లు, మూడు వేల పురిటి మరణాలు చోటుచేసుకున్నాయి. మన దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర వైద్యసేవల చిట్టాలో అబార్షన్‌ కూడా ఉంది. అయితే ఈ విషయం తెలియకపోవడంతో అవాంఛిత గర్భాన్ని తప్పనిసరిగా కొనసాగించవలసిన పరిస్థితిని కొందరు మహిళలు ఎదుర్కోక తప్పలేదు. లాక్‌డౌన్‌ మూలంగా రవాణా కుంటుపడి, ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్స్‌ కొరత ఏర్పడింది. దాంతో గర్భధారణ నిర్థారణ ఆలస్యమై అబార్షన్‌ చేయడానికి వీలుపడనంతగా నెలలు నిండుకున్న పరిస్థితి. దాంతో భారత ప్రభుత్వం కూడా అబార్షన్‌కు అర్హమైన గర్భిణుల ప్రెగ్నెన్సీ కాలపరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచింది. అయినప్పటికీ రవాణా సౌకర్యాల కొరత కారణంగా అబార్షన్‌ సమయానికి ఆత్మీయుల తోడ్పాడు అందదనే కారణంతో బలవంతంగా గర్భాన్ని కొనసాగించిన వారూ ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఎప్పుడు ముగుస్తుందో అంతుపట్టదు. ఇలాంటి అయోమయ స్థితి కూడా గర్భిణులను విపరీతమైన ఒత్తిడికి లోను చేసింది. చివరకు నెలల తరబడి లాక్‌డౌన్‌ కొనసాగి, నిబంధనలు ముగిసే సమయానికి మహిళలు రెండు లేదా మూడో నెలలోకి అడుగుపెట్టేశారు. ఇది అబార్షన్‌కు వీలుపడని స్థితి.పిండం వయసును బట్టి...

7 వారాల లోపు: రెండు రోజుల పాటు నోటి మాత్రలు వాడాల్సి ఉంటుంది. రక్తస్రావం రూపంలో అబార్షన్‌ అయిపోతుంది.


7 నుంచి 12 వారాల లోపు: ఈ అబార్షన్‌ కోసం డి అండ్‌ సి లేదా సక్షన్‌ ఇవాక్యుయేషన్‌ పద్ధతిని వైద్యులు అనుసరిస్తారు.


12 నుంచి 20 వారాలు: ఈ అబార్షన్‌కు ఇద్దరు ఎమ్‌డి డాక్టర్ల ఆమోదం అవసరం. ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి, వెజైనల్‌ టాబ్లెట్ల సహాయంతో ఒక్క రోజులో గర్భస్రావం చేస్తారు.


డాక్టర్‌. ప్రభ అగర్వాల్‌

గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్సెస్ట్రీషియన్‌,

మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.


Updated Date - 2021-01-12T18:01:14+05:30 IST