ఉత్పాదక రంగంలో టెక్నాలజీ అభివృద్ధిపై జోహో దృష్టి

ABN , First Publish Date - 2021-10-25T06:18:56+05:30 IST

భారత్‌లోని ఉత్పాదక రంగం చాలావరకు టెక్నాలజీ దిగుమతిపైనే ఆధారపడుతోంది. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం కొరత ఈ రంగాన్ని వేధిస్తోంది.

ఉత్పాదక రంగంలో టెక్నాలజీ అభివృద్ధిపై జోహో దృష్టి

త్వరలోనే తమిళనాడులో కంపెనీ ఏర్పాటు

కోయంబత్తూరు, అక్టోబరు 24: భారత్‌లోని ఉత్పాదక రంగం చాలావరకు టెక్నాలజీ దిగుమతిపైనే ఆధారపడుతోంది. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం కొరత ఈ రంగాన్ని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్నాలజీ అభివృద్ధి సంస్థ జోహో (జడ్‌వోహెచ్‌వో) ఈ సమస్యకు పరిష్కారం చూపేదిశగా ముందడుగు వేస్తోంది. ఉత్పాదక రంగ ప్రయోజనాల కోసం ప్రాంతీయ స్థాయిలో హై-ఎండ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తమిళనాడులోని కొంగు ప్రాంతంలో ఓ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్‌ వేంబు తెలిపారు. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో మరో మూడు నెలల్లో కంపెనీని ఏర్పాటు చేసి టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు చేపడతామని పేర్కొన్నారు. టెక్స్‌టైల్‌, మోటర్‌, పంపులు, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు, యంత్ర సామగ్రి వంటి ఎనిమిది అంశాల్లో కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా పరిశోధనలు చేస్తామని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-10-25T06:18:56+05:30 IST