యూపీ+యోగీ = ఉపయోగీ

ABN , First Publish Date - 2021-12-19T07:42:37+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో మాఫియాను పోషించినవారిని మాత్రమే అక్రమ కట్టడాల కూల్చివేత బాధిస్తోందంటూ ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ...

యూపీ+యోగీ = ఉపయోగీ

ఆయనవి జనం జేబు నింపే ప్రాజెక్టులు.. ఆదిత్యనాథ్‌కి మోదీ కితాబు

లఖ్‌నవూ, న్యూఢిల్లీ, డిసెంబరు 18 : ఉత్తరప్రదేశ్‌లో మాఫియాను పోషించినవారిని మాత్రమే అక్రమ కట్టడాల కూల్చివేత బాధిస్తోందంటూ ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అటువంటివారికీ, మాఫియాకూ వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగీని యూపీ ప్రజలు ‘ఉపయోగి’ (యూపీ+యోగి) అంటూ సంబోధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు భావిస్తున్నట్టే యోగీ మరింత మరింత ఉపయోగీ అంటూ చమత్కరించారు. రూ. 36,230 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు ‘గంగా ఎక్స్‌ప్రె్‌సవే’ పనులను షాజహాన్‌పూర్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరగడానికి ఒకరోజు ముందు యాదవ వర్గానికి ప్రధాన అడ్డా అయిన మెయిన్‌పూరీ సహా పలు నగరాల్లోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ సన్నిహితుల ఇళ్లలో కేంద్ర ఆదాయ పన్నుల విభాగం అధికారులు సోదాలు జరిపారు. కేంద్ర సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదంటూ అఖిలేశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మోదీ ఘాటు గా స్పందించారు. ‘‘మాఫియాపైకి బుల్డోజర్లు లేస్తే.. ఆ బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. ఆ మాఫియాను పెంచి పోషించినవారే ఆవేదనకు గురవుతారు’’ అని వ్యాఖ్యానించారు. జేబులు నింపుకునేందుకు గత ప్రభుత్వాలు కాగితాలపై పెద్ద ప్రాజెక్టులను కడితే.. ప్రజల ధనాన్ని ఆదాచేసేలా, వారి జేబులు నిండేలా యోగీ ప్రభుత్వం ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోందన్నారు. కాగా, మోదీ యూపీలో పర్యటించిన రోజునే, ఆర్థిక మాంద్యం సమస్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఆమేఠీలో సభలో పాల్గొన్నారు.


594 కి.మీ.... రూ. 36,230 కోట్లు

ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న గంగా ఎక్స్‌ప్రె్‌సవేకు ప్రత్యేకతలు ఎన్నెన్నో. ఆరు లేన్ల ఈ మార్గం సిద్ధమయితే యూపీలో అతిపెద్ద ఎక్స్‌ప్రె్‌సవే ఇదే కానుంది. అత్యవసర సమయాల్లో విమానాలు నేరుగా ఈ రోడ్డుపై దిగిపోవచ్చు. దీనికోసం షాజహాన్‌పూర్‌లో మూడున్నర కిలోమీటర్ల పొడవున ఎయిర్‌స్ర్టిప్‌ ఏర్పాటుచేస్తున్నారు. మీరట్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వరకు మొత్తం 594 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 36,230 కోట్లు. 

Updated Date - 2021-12-19T07:42:37+05:30 IST