మాఫియా నుంచి ప్రజల రక్షణ కోసమే వచ్చా : యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2021-12-31T19:19:56+05:30 IST

ప్రజలను మాఫియా కోరల నుంచి కాపాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తర ప్రదేశ్

మాఫియా నుంచి ప్రజల రక్షణ కోసమే వచ్చా : యోగి ఆదిత్యనాథ్

లక్నో : ప్రజలను మాఫియా కోరల నుంచి కాపాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, ఆ పరిస్థితులే తనను రాజకీయాల్లో చేరేందుకు ప్రేరేపించాయని తెలిపారు. 


1994 ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ ప్రముఖ కుటుంబం ఉండేదని, వారికి రెండు పెద్ద భవనాలు ఉండేవని చెప్పారు. ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫియాకు కేటాయించిందని, ఆందోళనకు గురైన ఆ కుటుంబం ఆ భవనాలను కూల్చేసిందని చెప్పారు.  వాటిని కూల్చేసిన మర్నాడు తాను ఆ కుటుంబాన్ని కలిసి, ఏం జరిగిందని, భవనాలను ఎందుకు కూల్చేశారని అడిగానన్నారు. అందుకు ఆ కుటుంబ సభ్యులు బదులిస్తూ, ఈ భవనాలను తాము కూల్చకపోతే, తాము సర్వం కోల్పోయి ఉండేవారమని చెప్పారన్నారు. భవనాలను కూల్చడం వల్ల కనీసం తమకు భూమి అయినా మిగిలిందని చెప్పారన్నారు. 


మరో రోజు తనకు గోరఖ్‌పూర్‌లోని ఓ సంపన్నుడు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. తన ఇంటిని ఓ మంత్రి ఆక్రమించినట్లు చెప్పారని తెలిపారు. వెంటనే తాను ఆ ఇంటికి వెళ్ళానని, అప్పటికి కొందరు వ్యక్తులు ఆ ఇంటి నుంచి సామాన్లను బయట విసిరేయడం చూశానని తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ఆ సంఘటను చూస్తున్నారని, ఏమీ చేయలేదని తెలిపారు. ఇంటి యజమాని దానిని అమ్మలేదని, అటువంటపుడు దానిని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారని అడిగానని చెప్పారు. దీంతో మాఫియా సభ్యులు తనకు కొన్ని కాగితాలను చూపించారని, వెంటనే తాను అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి, వీళ్ళని (మాఫియాను) చావగొట్టండి అని చెప్పానన్నారు. 


ఇటువంటి సంఘటనలు తనను రాజకీయాల్లో చేరే విధంగా చేశాయని చెప్పారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ఇటువంటి పనులు ఎవరూ చేయలేరన్నారు. చట్టవిరుద్ధంగా దేన్ని అయినా ఆక్రమించుకోవాలని క్రిమినల్స్ ఎవరైనా ప్రయత్నిస్తే, బుల్డోజర్లను ఎదుర్కొనవలసి వస్తుందని వారికి తెలుసునన్నారు. 


Updated Date - 2021-12-31T19:19:56+05:30 IST