బ్రతుకుపై ఆశలు వదులుకున్న ప్రపంచ పేదలు

ABN , First Publish Date - 2021-05-21T01:45:23+05:30 IST

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు చావు కోసం

బ్రతుకుపై ఆశలు వదులుకున్న ప్రపంచ పేదలు

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు చావు కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం భారత దేశంపై వారు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో దశ విజృంభించడంతో వ్యాక్సిన్ల ఎగుమతిపై ఆంక్షలు విధించినట్లు తెలుసుకుని నిరాశకు గురవుతున్నారు. 


కెన్యా, ఘనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా సహా పేద దేశాలు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కోవాక్స్‌ ద్వారా వ్యాక్సిన్లు వస్తాయని ఆశిస్తున్నాయి. అయితే కోవాక్స్‌కు భారీగా వ్యాక్సిన్లను అందించవలసిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్చి నుంచి వ్యాక్సిన్ ఎగుమతిని నిలిపేసింది. భారత ప్రభుత్వఅధికారులు చెప్తున్నదాని ప్రకారం ఈ ఏడాది అక్టోబరు కన్నా ముందు ఎగుమతిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఫలితంగా కోవాక్స్ స్కీమ్‌కు జూన్ ముగిసేనాటికి దాదాపు 190 మిలియన్ డోసుల వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుందని యునిసెఫ్ తెలిపింది. 


ఈ కొరత వల్ల పేద దేశాలు వ్యాక్సినేషన్‌లో మరింత వెనుకబడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది వ్యాక్సినేషన్‌లో అసమానతలకు దారి తీస్తుందని, ఈ మహమ్మారిని ఓడించడానికి ప్రపంచం చేస్తున్న కృషికి విఘాతం కలుగుతుందని అంటున్నారు. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిపై హెచ్చరికలను పట్టించుకోకపోతే జరిగేదేమిటో ప్రస్తుతం భారత దేశంలో ఈ మహమ్మారి విజృంభణ సూచిస్తోందని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీటా ఫోరే చెప్పారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, వైద్య, ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. నేపాల్, శ్రీలంక, అర్జంటైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. 


ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, దక్షిణ కొరియా వంటి దేశాలు భారత దేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతి కాకపోవడంతో ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. కెన్యా, ఇండోనేషియా వంటి దేశాలు వ్యాక్సిన్ల కోసం ఫ్ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, చైనా వ్యాక్సిన్ వంటివాటి వైపు చూస్తున్నాయి. 


ఆఫ్రికాలోని 54 దేశాలు కోవాక్స్‌పైనే ఆధారపడ్డాయి. ఇథియోపియా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సెక్రటరీ మెసెరెట్ జెలాలెమ్ భారత దేశం అమలు చేస్తున్న ఆంక్షలను ప్రస్తావిస్తూ, తమకు చాలా తక్కువ డోసుల వ్యాక్సిన్ వచ్చిందని, ఆ తర్వాత నిషేధం అమల్లోకి వచ్చిందని అన్నారు. తాము ప్రతి తలుపును, కిటికీని కొట్టి, వ్యాక్సిన్ కోసం ప్రాథేయపడవలసి ఉందన్నారు. తమ ప్రజలను కాపాడటానికి తమను ప్రత్యేక దృష్టితో చూడాలని అడగవలసి ఉందని చెప్పారు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ సోమవారం మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడే కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు కావాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని అందజేయాలని తయారీదారులను కోరుతున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయడం కేవలం కోవాక్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. 


Updated Date - 2021-05-21T01:45:23+05:30 IST