ఏ కమిటీలోనూ చేరబోం: తేల్చి చెప్పిన రైతులు

ABN , First Publish Date - 2021-01-13T00:04:36+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది..

ఏ కమిటీలోనూ చేరబోం: తేల్చి చెప్పిన రైతులు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే సుప్రీం తీర్పుతో రైతులు, రైతు సంఘాలు పూర్తిగా విబేధించాయి. తాము ఏ కమిటీలో చేరబోమని మంగళవారం తేల్చి చెప్పాయి. అంతే కాకుండా తాము కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరసనను ఇకపై కూడా కొనసాగిస్తామని రైతులు పునరుద్ఘాటించారు. వివాదస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే ప్రతిపాదనకు తాము ఒప్పుకోబోమని రైతులు మరోసారి స్పష్టం చేశారు.


సుప్రీం ప్రకటన వెనక కేంద్రం హస్తం: రైతులు

వ్యవసాయ చట్టాల వివాదంపై కమిటీ వేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంపై భారం తగ్గించుకోవడానికి సుప్రీం కోర్టు ద్వారా కమిటీ వేయించాలని ప్రయత్నిస్తున్నారని, గతంలో కమిటీ వేసే విషయమై కేంద్ర ప్రభుత్వమే అనేక మార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయమై సోమవారం ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశామని, అందులో తమ వైఖరి స్పష్టం చేసినట్లు రైతులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రతిపాదించే ఏ కమిటీని ఆమోదించమని, అందులో చేరమని రైతులు స్పష్టం చేశారు.


ఆందోళన ఎప్పటిలాగే కొనసాగుతుంది: బల్బీర్ సింగ్

వ్యవసాయ చట్టాలపై రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ఆందోళన ఇకపై కూడా కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. ఏ కమిటీలో చేరబోమని ఇదివరకే చెప్పామని, ఇప్పుడు అదే చెప్తున్నామని ఆయన అన్నారు. కమిటీలో ఉన్న సభ్యులంతా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులేనని రైతుల పక్షాన ఉన్నవాళ్లు ఒక్కరు కూడా లేరని బల్బీర్ విమర్శలు గుప్పించారు.


నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జితేందర్ సింగ్ మాన్ (బీకేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి (ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి (అగ్నికల్చరల్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంత్ (శివ్‌కేరి సంఘటన, మహారాష్ట్ర) కమిటీ సభ్యులుగా ఉంటారని కోర్టు పేర్కొంది. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-13T00:04:36+05:30 IST