వెజ్ ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ పిజ్జా వచ్చినందుకు కోర్టుకెక్కిన మహిళ

ABN , First Publish Date - 2021-03-14T08:21:58+05:30 IST

రెస్టారెంట్ యాజమాన్యం తనకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెజిటేరియన్ మహిళ కోర్టులో పోరాడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వెజ్ ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ పిజ్జా వచ్చినందుకు కోర్టుకెక్కిన మహిళ

ఘజియాబాద్: రెస్టారెంట్ యాజమాన్యం తనకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెజిటేరియన్ మహిళ కోర్టులో పోరాడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌కు చెందిన దీపాళి త్యాగి అనే మహిళ 2019 మార్చి 21న పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే వెజ్ బదులుగా డెలివరీ బాయ్ నాన్-వెజ్ పిజ్జాను డెలివరీ చేశాడు. పిజ్జాలోని ఒక ముక్క తిన్న వెంటనే దీపాళికి అనుమానం కలిగింది. అనంతరం మష్‌రూం బదులు పిజ్జాలో మాంసం ముక్కలు ఉన్నట్టు గుర్తించింది. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా కన్జూమర్ కోర్టులోనూ కేసు ఫైల్ చేసింది. జరిగిన తప్పుకు క్షమాపణలు తెలుపుతూ, కుటుంబం మొత్తానికి ఉచితంగా పిజ్జాలు ఇస్తామంటూ రెస్టారెంట్ తెలిపింది. 


అయితే తాను మాంసం ముక్కలను తినడం వల్ల మానసిక వేదనకు గురయ్యానంటూ దీపాళి కోర్టుకు చెప్పింది. ఒక జీవిని చంపి తినడం తప్పు అనే ఆచారాన్ని తాను ఇంతకాలం పాటిస్తూ వచ్చానని, పిజ్జా రెస్టారెంట్ వల్ల తన ఆచారాలను కూడా తప్పానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను చేసిన పాపాలను తొలగించుకునేందుకు లక్షలు ఖర్చుపెట్టి పూజలు చేశానని కోర్టుకు దీపాళి తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. తన క్లైంట్ పూజలకు అయిన ఖర్చులు, ఆమె మానసిక వేదనకు కారణమైనందుకు రెస్టారెంట్ రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టును కోరారు. ఇదిలా ఉంటే.. దీపాళి ఫిర్యాదుపై స్పందించాలంటూ తాజాగా కోర్టు రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి హియరింగ్ మార్చి 17న జరగనుంది.

Updated Date - 2021-03-14T08:21:58+05:30 IST