అదే జరిగితే సర్కార్ ఆఫీసుల్ని గల్లా మండీలుగా మారుస్తాం: టికాయత్

ABN , First Publish Date - 2021-10-31T19:48:57+05:30 IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను సరిహద్దుల నుంచి బలవంతంగా తొలగిస్తే..

అదే జరిగితే సర్కార్ ఆఫీసుల్ని గల్లా మండీలుగా మారుస్తాం: టికాయత్

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను సరిహద్దుల నుంచి బలవంతంగా తొలగిస్తే ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా (అనాజ్ మండీ) మారుస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారంనాడు ఒక ట్వీట్‌లో హెచ్చరించారు. ఘజియాపూర్, టిక్రి సరిహద్దుల్లోని బారికేడ్లు, సిమెంట్ బ్లాక్‌లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో టికాయత్  తాజా హెచ్చరికలు చేశారు.


సరిహద్దు ప్రాంతాల్లో రైతులు నిరసన దీక్షలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు 11 నెలలుగా అలాగే ఉండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. రైతు నిరసనకారులు కాకుండా అధికారులు ఎందుకు ట్రాఫిక్‌ను ఆపుతున్నారంటూ సుప్రీంకోర్టు ఇటీవల నిలదీసింది. దీంతో గత మంగళవారంనాడ జేసీబీ మిషన్లతో బారికేడ్లను ఢిల్లీ పోలీసులు తొలగించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి, రైతు ప్రతినిధులకు మధ్య పలు విడతలు చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

Updated Date - 2021-10-31T19:48:57+05:30 IST