దీప్‌ సిద్ధూని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-02-05T20:41:26+05:30 IST

ఢిల్లీ విధ్వంసం అనంతరం దీప్ సిద్ధూ పరారీలో ఉన్నాడు. ఢిల్లీ విధ్వంసంపై 37 మందిపై ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా దీప్ సిద్ధూ విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని

దీప్‌ సిద్ధూని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?: సంజయ్ రౌత్

ముంబై: జనవరి 26న ఢిల్లీలో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారకుడైన దీప్ సిద్ధూని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడుతూ విధ్వంసంతో సంబంధం లేని వారిపై కేసులు పెట్టి, ప్రధాని నిందితుడిని ఎందుకు వదిలేశారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.


‘‘రెండు నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దేశ రాజధానిలో విధ్వంసం జరగడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులపై నిందలు వేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసంలో ప్రధాన నిందితుడు దీప్ సిద్ధూనే. ఈ మాట అతడే స్వయంగా చెప్పాడు. అయినా అతడిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ అతడిని అరెస్ట్ చేయలేకపోయారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు ఏం జరిగిందో తెలియాలి’’ అని సంజయ్ రౌత్ అన్నారు.


ఢిల్లీ విధ్వంసం అనంతరం దీప్ సిద్ధూ పరారీలో ఉన్నాడు. ఢిల్లీ విధ్వంసంపై 37 మందిపై ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా దీప్ సిద్ధూ విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఇంకొందరైతే దీప్ సిద్ధూ బీజేపీ నేతని, ప్రభుత్వమే దీప్ సిద్దూని దాస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Updated Date - 2021-02-05T20:41:26+05:30 IST