అనవసర ప్రాజెక్టులపై ఖర్చులెందుకు? : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-04-24T18:12:48+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అనవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకని
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అనవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరమైన ప్రాజెక్టులు, ప్రజా సంబంధాల ప్రచారం కోసం ఖర్చు చేయడానికి బదులుగా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ప్రజారోగ్య సేవలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను కొనసాగించడాన్ని రాహుల్ గాంధీ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి ప్రజలను బాధిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యమివ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. టెస్ట్‌లు జరగడం లేదని, వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, ఐసీయూ బెడ్స్ అందుబాటులో లేవని, ఇటువంటి సమయంలో ఈ ప్రాజెక్టుపై ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారని నిలదీశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో మూడు సెక్రటేరియల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పేర్కొంటున్న న్యూస్ ఐటెమ్‌ను ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ జత చేశారు.
రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, అనవసరమైన ప్రాజెక్టులపైనా, ప్రజా సంబంధాల ప్రచారంపైనా ఖర్చు చేయడానికి బదులుగా, వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంక్షోభం రానున్న రోజుల్లో మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనడానికి దేశం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత దయనీయ స్థితి భరించలేనిదన్నారు.
భారత దేశ అధికార నడవ (పవర్ కారిడార్)గా చెప్పుకునే ప్రభుత్వ, పార్లమెంటరీ కార్యాలయాల సముదాయాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది న్యూఢిల్లీలోని రైజినా హిల్స్‌లో ఉంది. ప్రస్తుత పార్లమెంటు భవనం సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతాయి. కొన్ని చారిత్రక వారసత్వ భవనాలకు మెరుగులు దిద్దడం కూడా దీనిలో భాగమే.