కొత్త సీడీఎస్‌ ఎవరు..?

ABN , First Publish Date - 2021-12-09T07:37:02+05:30 IST

జనరల్‌ బిపిన్‌ రావత్‌ అకాల మృతితో కొత్త సీడీఎస్‌ నియామకంపై ఊహాగానాలు మొదలయ్యాయి..

కొత్త సీడీఎస్‌ ఎవరు..?

  • సీనియారిటీ ప్రకారం చూస్తే 
  • జనరల్‌ నరవాణెకు చాన్స్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 8: జనరల్‌ బిపిన్‌ రావత్‌ అకాల మృతితో కొత్త సీడీఎస్‌ నియామకంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండంతో కేంద్రం వీలైనంత త్వరగా కొత్త సీడీఎస్‌ను నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాల్లో ఆయా విభాగాల్లో టాప్‌ ర్యాంక్‌ ఆఫీసర్లను గుర్తించడం తేలిక. అయితే సీడీఎస్‌ కొత్త పోస్టు అయినందున తర్వాత సీనియర్‌ అంటూ ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లో... త్రివిధ దళాల్లోనే టాప్‌ ఆఫీసర్‌ను సీడీఎస్‌గా నియమించే అవకాశం ఉంది. ఇలా చూస్తే జనరల్‌ రావత్‌ తర్వాత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవాణె సీనియర్‌ ఆఫీసర్‌ అవుతారు. జనరల్‌ నరవాణె కంటే ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ సుమారు రెండేళ్లు జూనియర్లు. ఒకవేళ నరవాణెను సీడీఎస్‌గా నియమిస్తే ఆయన ప్రస్తుత స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్‌ను కూడా నియమించాలి.


నరవాణె తర్వాత ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మొహంతి, నార్త్రన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి సైన్యంలో సీనియర్లు. వీరిద్దరూ బ్యాచ్‌మేట్లు. సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రం నియమించిన షేకత్కర్‌ కమిటీ సిఫార్సులను బట్టి చూసినా... త్రివిధ దళాల చీఫ్‌లలో ఒకరిని ప్రభుత్వం సీడీఎస్‌గా నియమించాల్సి ఉంటుంది. ఇది కూడా జనరల్‌ నరవాణెకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-09T07:37:02+05:30 IST