రాజద్రోహ చట్టం అంటే?
ABN , First Publish Date - 2021-07-16T08:11:07+05:30 IST
ఇది భారత శిక్షా స్మృతిలోని ఒక సెక్షన్. 124ఏ లేదా రాజద్రోహ నిబంధనగా పిలుస్తారు.
ఇది భారత శిక్షా స్మృతిలోని ఒక సెక్షన్. 124ఏ లేదా రాజద్రోహ నిబంధనగా పిలుస్తారు. ఐపీసీ 1860లో అమల్లోకి వస్తే రాజద్రోహం(124ఏ) నిబంధన మరో పదేళ్ల తర్వాత చేర్చారు. థామస్ బాబింగ్టన్ మెకాలే దీన్ని రాశారు.
అందులో ఏముందంటే..!
చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల ద్వారా, రాతల ద్వారా, సైగల ద్వారా, దృశ్య మాధ్యమం ద్వారా ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగిల్చినా, అందుకు ప్రయత్నించినా రాజద్రోహమే అవుతుంది. గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించవచ్చు. మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. లేదా కేవలం జరిమానాతో వదిలేయవచ్చు. రాజద్రోహం కేసు పెడితే బెయిలు రాదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. పాస్‌పోర్టు ఇవ్వరు. పిలిచినపుడల్లా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ సెక్షన్‌ను 1870 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ రోజుల్లో ఈ సెక్షన్ కింద ప్రవాస శిక్షను కూడా విధించేవారు. బాల గంగాధర్ తిలక్‌ను బర్మాలోని మాండలే జైలుకు ఈ సెక్షన్ కిందే పంపించారు. మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమందిని శిక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రయోగించింది.
స్వాతంత్య్రం తర్వాత కూడా సవరించిన రూపంలో సెక్షన్ 124 ఏ కింద రాజద్రోహ నేరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 1958లో వాక్ స్వాతంత్ర్యానికి సెక్షన్ 124 ఏ అడ్డుకట్ట వేస్తుందని భావించిన అలహాబాద్ హైకోర్టు పూర్తి బెంచ్ దాన్ని కొట్టి వేసింది. రాంనందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో హైకోర్టు చెబుతూ అది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపింది. పంజాబ్ హైకోర్టు కూడా తారాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సెక్షన్ 124ను కొట్టి వేసింది. ఈ రెండు కేసులపై కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు విచారిస్తూ హైకోర్టుల తీర్పులను పక్కన పెట్టింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగపరంగా చెల్లుతుందని, అయితే అదొక మినహాయింపు మాత్రమేనని తెలిపింది. రాజద్రోహ నేరాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేసింది, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం రాజ ద్రోహనేరం కాదని స్పష్టం చేసింది.
ఇటీవలి కేసులు
బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల పర్యావరణ కార్యకర్త దిశారవి సాగు చట్టాలపై రైతుల నిరనస ప్రదర్శనకు సంబంధించి ఒక టూల్ కిట్‌ను సోషల్ మీడియాలో పంచిపెట్టినందుకు 2020 ఫిబ్రవరి 13న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహ నేరం మోపారు. వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పర్చడం కానీ, టూల్‌కిట్‌ను రూపొందించడం కానీ నేరం కాదని ఢిల్లీ కోర్టు ప్రక టించి ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఎర్రకోట వద్ద నిరసనలు తెలిపిన అనేక మందిపై కూడా సెక్షన్ 124 ఏ కింద కేసులు మోపారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో యూపీలోని హత్రా్‌సలో మూక అత్యాచారానికి గురై 19 ఏళ్ల దళిత స్త్రీ మరణించిన సంఘటనపై వివరాలు.
తెలుసుకునేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌ను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహ నేరంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం క్రింద కూడా కేసు మోపారు.
కమ్యూనిస్టు మేనిఫెస్టో, మావో జీవిత చరిత్ర చదవడం, స్నేహితులను కామ్రేడ్ అని, లాల్ సలామ్ అని పిలవడం చేసినందుకు 2019 సెప్టెంబర్‌లో అస్సాంలో రైతు నేత, హక్కుల కార్యకర్త అఖిల్ గొగోయ్‌పై రాజద్రోహ నేరం మోపారు.
2016లో జెఎన్‌యూ కాంప్‌సలో రాజద్రోహ పూరితమైన నినాదాలు చేశారంటూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్యతో పాటు పది మందిపై రాజద్రోహ నేరం మోపారు.
లక్షద్వీప్లో కోవిడ్-19 వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఇటీవల మోడల్ ఆయేషా సుల్తానాపై రాజద్రోహ నేరం మోపారు.
సోషల్ మీడియాలో కార్టూన్లు షేర్ చేసినందుకు మణిపూర్‌క చెందిన కిషోర్ చంద్ర వాంగ్ ఖేమ్చా, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన కన్హయ్యలాల్ శుక్లాపై రాజద్రోహనేరం మోపారు.
ఎవరేమన్నారు?
ఐపీసీలో రాజకీయ సెక్షన్లలో 124ఏ ప్రధానమైనది. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికి రూపొందించినది.
- మహాత్మాగాంధీ(1922)
ఈ నిబంధన చెడ్డది. అత్యంత అభ్యంతరకరమైనది. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.
- జవహర్‌లాల్ నెహ్రూ(1951)
రాజద్రోహ నిబంధనను రద్దు చేసే యోచన లే దు. దేశ ద్రోహులను, వేర్పాటువాదులను, ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే.
- నిత్యానందరాయ్, హోంశాఖ సహాయ మంత్రి (2019)
