ఆ నలుగురే నేరం చేశారనడానికి.. ఆధారాలేంటి?: దిశ కమిషన్
ABN , First Publish Date - 2021-11-26T08:52:19+05:30 IST
ఆ నలుగురే దిశను హత్యాచారం చేశారనడానికి ఆధారాలు ఏమున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వీ.సురేందర్‌రావును విచారణ కమిషన్ ప్రశ్నించింది.

హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆ నలుగురే దిశను హత్యాచారం చేశారనడానికి ఆధారాలు ఏమున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వీ.సురేందర్‌రావును విచారణ కమిషన్ ప్రశ్నించింది. తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి దిశను తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించడం లేదని.. అలాంటప్పుడు వారే నిందితులని ఎలా నిర్ధారణకు వచ్చారని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఆ నలుగురే నేరం చేశారనడానికి అనేక ఆధారాలున్నాయన్నారు. దిశ తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిన కాల్‌రికార్డింగ్‌తోపాటు పంక్చర్ షాప్ నిర్వాహకుడు, పెట్రోల్ బంక్ ఉద్యోగులు, లారీ యజమాని శ్రీనివా్‌సరెడ్డి, నిందితుల కుటుంబసభ్యుల విచారణలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారని కమిషన్‌కి వివరించారు. బలమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఆరు నెలల క్రితం న్యాయవాది దంపతులు హత్యకు గురయ్యారని, ఆ సమయంలో రెండు బస్సుల్లో జనం ఉన్నా స్పందించలేదని.. దిశ విషయంలో కూడా అలాగే జరిగిందని పేర్కొన్నారు. సంఘటన ప్రదేశ పరిశీలనకు ఒక కమిటీని నియమించాలని కోరారు. నలుగురు నిందితులను లారీ యజమాని శ్రీనివా్‌సరెడ్డి తన కారులో షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారి.. అసలు ఆయనకు ఈ వ్యవహారంలో సంబంధం ఏముందని కమిషన్ ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే ఆయనను పోలీసులు పిలిపించారని సురేందర్ సమాధానమిచ్చారు.