యూపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2021-12-30T19:11:11+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కోరాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర గురువారం చెప్పారు. ఎన్నికలను నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ బృందం మంగళవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది.
మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఎన్నికల కమిషన్ బృందం గురువారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఈసీ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమను కలిశారని తెలిపారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ, శాసన సభ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని కోరారని చెప్పారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని చెప్పారు. పోలింగ్‌ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పోలింగ్ బూత్‌లలోనూ VVPATలను అమర్చుతామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం దాదాపు 1 లక్ష పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెస్తామన్నారు.
పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసే సామర్థ్యం లేనటువంటి 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, వికలాంగులు, కోవిడ్ ప్రభావితుల ఇళ్లకు వెళ్లి, ఓట్లు వేయిస్తామని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు శాసన సభల ఎన్నికలు జరుగుతాయి. వీటి కోసం ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే మంగళవారం జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరారు. పోలింగ్ సమయంలో కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించాలని కోరారు.
ఎన్నికల కమిషన్ బృందం బుధవారం జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు చీఫ్స్, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైంది. శాసన సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది.
ఎన్నికల కమిషన్ సోమవారం న్యూఢిల్లీలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఒమైక్రాన్ వ్యాప్తి పరిస్థితులు, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యల గురించి చర్చించింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, శాంపిల్ టెస్ట్‌లను పెంచాలని, కోవిడ్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.