దేశ ప్రజలను పణంగా పెట్టి వ్యాక్సిన్లను ఎన్నడూ ఎగుమతి చేయలేదు : అదర్ పూనావాలా

ABN , First Publish Date - 2021-05-19T01:31:54+05:30 IST

దేశ ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యాక్సిన్లను

దేశ ప్రజలను పణంగా పెట్టి వ్యాక్సిన్లను ఎన్నడూ ఎగుమతి చేయలేదు : అదర్ పూనావాలా

ముంబై : దేశ ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యాక్సిన్లను ఎన్నడూ ఎగుమతి చేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పష్టం చేశారు. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు, మూడు నెలల్లో పూర్తి కాబోదని తెలిపారు. కోవిడ్-19 కోసం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. 


అదర్ పూనావాలా మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గతంలో ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడానికి కారణాలను వివరించారు. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, ఎగుమతి చేయడం లేదని తెలిపారు. గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నపుడు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా గతంలో ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపించినట్లు చెప్పారు. 


ప్రపంచంలో అత్యధిక జనాభాగల రెండు దేశాల్లో భారత దేశం ఒకటి అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని తెలిపారు. అటువంటి జనాభాగల దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు లేదా మూడు నెలల్లో పూర్తి కాబోదన్నారు. అమెరికా ఫార్మా కంపెనీల కన్నా రెండు నెలలు ఆలస్యంగా తమకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనుమతులు వచ్చాయని, అయినప్పటికీ సీరం ఇన్‌స్టిట్యూట్ 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిందని చెప్పారు. ఉత్పత్తి చేసిన డోసులు, బట్వాడా చేసిన డోసులను పరిశీలిస్తే, సీరం సంస్థ ప్రపంచంలో మూడు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. 


ఈ మహమ్మారి భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులకు పరిమితం కాదనే విషయాన్ని కూడా గ్రహించాలని కోరారు. ఈ వైరస్‌ను ప్రతి ఒక్కరూ ఓడించే వరకు మనం సురక్షితం కాదని వివరించారు. 


Updated Date - 2021-05-19T01:31:54+05:30 IST