అవినీతి నిర్మూలన సాధ్యమని నమ్మకం కలిగించాం : మోదీ
ABN , First Publish Date - 2021-10-20T21:08:22+05:30 IST
అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం

కేవడియా : అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమని ప్రజలకు తన ప్రభుత్వం నమ్మకం కలిగించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గడచిన ఆరు-ఏడు సంవత్సరాల నుంచి తన ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇది సాధ్యమైందని బుధవారం ఓ సమావేశంలో చెప్పారు.
గుజరాత్లోని కేవడియాలో బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంయుక్త సమావేశంలో మోదీ మాట్లాడారు. అవినీతిపై పోరాడాలనే దృఢ నిశ్చయం గత ప్రభుత్వానికి లేదన్నారు.
‘‘దేశంలో అవినీతిని ఆపడం సాధ్యమేనని మేము గడచిన ఆరేడు సంవత్సరాల్లో ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచగలిగాం. మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమనే నమ్మకం దేశ ప్రజలకు నేడు కలిగింది. అవినీతి తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, సామాన్యుల హక్కులను పోగొడుతుంది. దేశ ప్రగతికి ఇది ఆటంకం, మన సమష్టి శక్తిపై ప్రభావం చూపుతుంది’’ అని మోదీ చెప్పారు. దేశానికి, ప్రజలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారికి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత స్థానం ఉండదన్నారు.